ఘోషామహల్ ప్రత్యేకత ఏమిటంటే…

November 19, 2018


img

ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో మరే నియోజకవర్గానికి లేని ఒక ప్రత్యేకతను గోషామహల్ నియోజకవర్గం సంతరించుకొంది. గోషామహల్ నుంచి చంద్రముఖి మువ్వల అనే ట్రాన్స్‌జెండర్‌ (నపుంసక) బిఎల్ఎఫ్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. ఆమె నేడు తన నామినేషన్ వేశారు. ఆమె ట్రాన్స్‌జెండర్‌ అయినప్పటికీ బాల్యం నుంచే భరతనాట్యం, నటన, సంగీతంపై అభిరుచి పెంచుకొని ఆ రంగాలలో ప్రావీణ్యం సంపాదించారు. సమాజంలో ట్రాన్స్‌జెండర్స్ కు నిత్యం ఎదురవుతున్న అవమానాలు, అవహేళనలు, తిరస్కారాలను స్వయంగా అనుభవించిన చంద్రముఖి, వారి సమస్యల పరిష్కారం కోసం దశాబ్ధకాలంగా కృషి చేస్తున్నారు. అనేక సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా ఆమె పాల్గొంటుంటారు. ఆమె ప్రతిభను గుర్తించిన బిఎల్ఎఫ్ ఆమెకు గోషామహల్ నుంచి తమ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు టికెట్ కేటాయించింది. 

తనను గెలిపిస్తే ట్రాన్స్‌జెండర్స్ సమస్యలను, అలాగే గోషామహల్ నియోజకవర్గంలో పెరుకుపోయిన పలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చంద్రముఖి ప్రజలకు హామీ ఇస్తున్నారు. తనకు టికెట్ ఇచ్చి గౌరవించినందుకు బిఎల్ఎఫ్ కూటమిలో పార్టీలకు, కన్వీనర్ తమ్మినేని వీరభద్రంకు ఆమె కృతజ్నతలు తెలిపారు. తాను గెలిస్తే ట్రాన్స్‌జెండర్స్ కు విద్యా, వైద్య, ఉద్యోగావకాశాల కోసం, పెన్షన్ల కోసం గట్టిగా కృషి చేస్తానని చెప్పారు. ఒక రాజకీయ కూటమి ఆమెను గౌరవించి టికెట్ ఇచ్చి ప్రోత్సహించడం అభినందనీయం. కానీ ప్రజలు కూడా ఆమెను ఆధారిస్తారా? చూడాలి. 


Related Post