గ్రేటర్ పై దృష్టి పెడుతున్న కేటిఆర్‌

November 17, 2018


img

మహాకూటమి, బిజెపితో సహా దాదాపు అన్ని పార్టీలు గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో అన్ని నియోజకవర్గాలకు తమతమ అభ్యర్ధులను ప్రకటించడంతో పార్టీల వ్యూహాల పై కొంత స్పష్టత వచ్చింది. కనుక మంత్రి కేటిఆర్‌ మళ్ళీ గ్రేటర్ పరిధిలో నియోజకవర్గాలపై దృష్టిపెట్టి ఒక్కో వర్గం ప్రజలతో వేర్వేరుగా సమావేశం అవుతున్నారు. గ్రేటర్ పరిధిలోని ఇంతకు ముందు ఆంధ్రా, గుజరాతీ ఓటర్లతో సమావేశమైన మంత్రి కేటిఆర్‌ ఇప్పుడు ముస్లిం నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. 

ఈరోజు నాంపల్లిలో ముస్లిం నేతలతో సమావేశమైనప్పుడు వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఒకప్పుడు కాంగ్రెస్‌ హయాంలో హైదరాబాద్‌ నగరంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉండేవి. కానీ గత నాలుగేళ్ల మా పాలనలో నగరంలో ఒక్కరోజు కూడా కర్ఫ్యూ విధించలేదు. ఒక మత ఘర్షణ కూడా జరుగలేదు. నగరంలో చాలా ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. అలాగే లౌకికవాది అయిన సిఎం కేసీఆర్‌ రాష్ట్రంలో అన్ని మతాల ప్రజలను సమానంగా చూస్తూ, వారిలో పేదలకు సమానావకాశాలు కల్పిస్తున్నారు. గాంధేయ పద్దతిలో పొరాడి తెలంగాణసాధించిన కేసీఆర్‌ మాటల మనిషి కాదని మన అందరికీ తెలుసు. ఆయన రాష్ట్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి చేస్తున్న కృషిని మీరందరూ చూస్తూనే ఉన్నారు. కనుక ఈ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగాలంటే మరో 20 ఏళ్ళపాటు కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా కొనసాగవలసిన అవసరం ఉంది. కనుక తెరాసను మళ్ళీ గెలిపించుకోవలసిన భాద్యత మీ అందరిపై ఉంది. ఒకవేళ మహాకూటమి నేతల మాయమాటలు నమ్మి వారికి అధికారం కట్టబెడితే రాష్ట్రంలో మళ్ళీ తెలంగాణ ఏర్పడక మునుపు ఉన్న గడ్డు పరిస్థితులు పునరావృతం అవుతాయని మరిచిపోవద్దు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అమలుచేయలేని హామీలను ఇక్కడ తాము అధికారంలోకి వస్తే అమలుచేస్తామని కాంగ్రెస్‌ నేతలు చెపుతున్న మాయ మాటలను నమ్మి మోసపోవద్దని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను,” అని మంత్రి కేటిఆర్‌ అన్నారు.


Related Post