టికెట్ లభించకపోవడంపై మర్రి శశిధర్ రెడ్డి స్పందన

November 17, 2018


img

మర్రి శశిధర్ రెడ్డి...కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలలో ఒకరు. గత నాలుగేళ్లుగా తెరాసతో నిరంతరం పోరాటాలు చేస్తున్నారు. అటువంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదంటే పార్టీలో నేతలే కాదు... తెరాస నేతలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ విడుదల చేసిన 3వ జాబితాలో తన పేరు లేకపోవడం, అదే సమయంలో తాను కోరుకొన్న సనత్ నగర్ నియోజకవర్గానికి కూన వెంకటేష్ గౌడ్ ను టిడిపి అభ్యర్ధిగా ప్రకటించడంతో ఆయన సహజంగానే తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. 

టికెట్ లభించకపోవడంపై మీడియా ప్రతినిధులు ఆయన స్పందన కోరగా, “ఇన్ని దశాబ్ధాలుగా పార్టీలో పనిచేస్తున్న నాకు టికెట్ ఇవ్వకపోవడం చాలా బాధ కలిగించింది. అయితే నియోజకవర్గంలో నా అనుచరులకు నేను సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. కనుక వారితో మాట్లాడి నా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాను. టికెట్ లభించనందున ప్రత్యామ్నాయమార్గాలు చూసుకోక తప్పదు,” అని అన్నారు. 

‘ప్రత్యామ్నాయమార్గాలు చూసుకోక తప్పదు’ అనే మాటకు అర్ధం స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగడం లేదా వేరే పార్టీలో చేరి పోటీ చేయడమని భావించవచ్చు. ఇప్పటికే అన్ని పార్టీలు ఆ నియోజకవర్గానికి అభ్యర్ధులను ప్రకటించేశాయి కనుక వేరే పార్టీలో చేరేందుకు సమయం మించిపోయిందని చెప్పవచ్చు కనుక ఆయన స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగే అవకాశం కనబడుతోంది. ఒకవేళ కాంగ్రెస్‌ అధిష్టానం బుజ్జగింపులకు లొంగితే ఎన్నికలకు దూరంగా ఉండాలి. నామినేషన్ వేయడానికి కేవలం రెండు రోజులు సమయం మాత్రమే మిగిలి ఉంది కనుక నేడో రేపో మర్రి శశిధర్ రెడ్డి తగిన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.


Related Post