బాబు నిర్ణయం ఎన్టీఆర్ కుటుంబంలో చిచ్చు

November 17, 2018


img

తెలుగుదేశం పార్టీని స్థాపించింది స్వర్గీయ ఎన్టీఆర్ అయినప్పటికీ ఆ తరువాత జరిగిన అనేక రాజకీయ పరిణామాల కారణంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు టిడిపి అనుకూల, వ్యతిరేకవర్గాలుగా విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. స్వర్గీయ నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని కూకట్ పల్లి నుంచి టిడిపి అభ్యర్ధిగా నిర్ణయించి చంద్రబాబు నాయుడు నందమూరి కుటుంబానికి మరో అగ్నిపరీక్ష పెట్టారని చెప్పవచ్చు.

పురందేశ్వరి, లక్ష్మీ పార్వతి వేరే పార్టీలలో ఉన్నారు కనుక వారికి ఇది సమస్య కాబోదు. కానీ 2009 ఎన్నికలలో జూనియర్ ఎన్టీఆర్ ను పూర్తిగా వాడుకొన్న చంద్రబాబు నాయుడు ఆ తరువాత ఒక పద్దతి ప్రకారం టిడిపికి దూరం చేశారు. ఆనాడు జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల ప్రభావం జూనియర్ ఎన్టీఆర్ సినిమాలపై కూడా పడటంతో తీవ్రంగా దెబ్బ తిన్నాడు. అప్పటి నుంచి టిడిపికి దూరంగా ఉంటూ పూర్తిగా తన సినిమాలకే పరిమితమయ్యి మళ్ళీ నిలద్రొక్కుకోగలిగారు.

ఈ నేపద్యంలో మళ్ళీ ఇప్పుడు తన అక్క కోసం టిడిపి తరపున ఎన్నికల ప్రచారం చేయడానికి వెళ్ళక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. కానీ వెళితే మళ్ళీ టిడిపి రాజకీయాలతో సినీ కెరీర్ దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది. అదీగాక అక్క తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆమెను గెలిపించుకొంటే తెరాసకు ఆగ్రహం కలిగించవచ్చు. ఇది తెలంగాణలో ఎన్టీఆర్ సినిమాలపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది.

ఇది జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ల సమస్య కాగా సుహాసిని టిడిపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్నందున ఎన్టీఆర్ కుటుంబంలో (బాలకృష్ణ తప్ప) మిగిలినవారు ఆమెకు బహిరంగంగా మద్దతు తెలుపుతారో లేదో తెలియదు. కనుక చంద్రబాబు నిర్ణయం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు...ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కు మళ్ళీ మరొక అగ్నిపరీక్షగా మారిందని చెప్పవచ్చు. 


Related Post