కూకట్ పల్లి నుంచి నందమూరి హరికృష్ణ కుమార్తె పోటీ

November 16, 2018


img

మహాకూటమిలో భాగంగా టిడిపికి కూకట్ పల్లి స్థానం లభించిన సంగతి తెలిసిందే. మొదట అక్కడి నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి లేదా కూకట్‌పల్లి కార్పొరేటర్ మందాడి శ్రీనివాస్ లలో ఎవరో ఒకరిని బరిలో దింపాలని టిడిపి అనుకొంది. కానీ ఆ స్థానం నుంచి స్వర్గీయ నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని బరిలో దింపాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. పెద్దిరెడ్డి, శ్రీనివాస్ ఇద్దరికీ ఆయన నచ్చజెప్పి సుహాసిని గెలుపుకు సహకరించవలసిందిగా కోరారు. వారివురు అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు మాట కాదనలేకపోవడంతో సుహాసినికి ఈరోజు సాయంత్రం టిడిపి నామినేషన్ పత్రాలు అందజేసింది. టిడిపి నేతలను వెంటబెట్టుకొని ఆమె రేపు ఉదయం కూకట్ పల్లి నుంచి నామినేషన్ వేయబోతున్నారు. కూకట్ పల్లిలో 1.2 లక్షల మంది ఆంధ్రా ఓటర్లున్నారు. వారందరూ నందమూరి కుటుంబంపై అభిమానంతో ఆమెను తప్పకుండా గెలిపిస్తారనే నమ్మకంతో చంద్రబాబు నాయుడు ఆమె పేరును ప్రతిపాదించారు. 

కూకట్ పల్లి నుంచి తెరాస తరపున మాధవరం కృష్ణారావు, బిజెపి అభ్యర్ధిగా మాధవరం కాంతారావు పోటీ చేస్తున్నారు. వారిలో మాధవరం కృష్ణారావు గత ఎన్నికలలో ఇదే నియోజకవర్గం నుంచి టిడిపి టికెట్ పై పోటీ చేసి గెలిచారు. కానీ ఆ తరువాత తెరాసలోకి ఫిరాయించారు. ఆయన ఇప్పుడు టిడిపి అభ్యర్ధినే ఎదుర్కోవలసి రావడం విశేషం.


Related Post