ఏపీలో సిబిఐకి నో ఎంట్రీ!

November 16, 2018


img

అవును. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇకపై సిబిఐ సంస్థ ఎటువంటి దర్యాప్తులు చేయడానికి వీలులేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిబిఐ దర్యాప్తుకు అవసరమైన సాధారణ సమ్మతిని ఉపసంహరించుకొంటున్నట్లు ఒక జీవో జారీ చేసింది. సాధారణంగా డిల్లీ మినహా దేశంలో ఏ రాష్ట్రంలోనైనా సిబిఐ దర్యాప్తు చేయడానికి వీలుగా ఆయా ప్రభుత్వాలు సమ్మతించవలసి ఉంటుంది. ఇది కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మద్య నిత్యం జరిగే పరిపాలనా వ్యవహారాలలో భాగంగా జరిగే ప్రక్రియ కనుక సిబిఐ దర్యాప్తుకి అనుమతి లభిస్తుంటుంది. కనుక ఈ సమ్మతి నిరాకరణ ప్రస్తావన ఎప్పుడూ వినబడలేదు.

కానీ టిడిపి-బిజెపిలకు, బాబు-మోడీ ప్రభుత్వాల మద్య సంబంధాలు దెబ్బ తిన్నప్పటి నుంచి ఏపీలో టిడిపి నేతల ఇళ్ళు, కార్యాలయాలపై ఐ‌టి దాడులు పెరిగాయి. కనుక తమను రాజకీయంగా దెబ్బ తీసేందుకు కేంద్రం సిబిఐని కూడా తమపై ఉసి గొల్పవచ్చనే అనుమానంతోనే టిడిపి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. కానీ సిబిఐ సంస్థలో అత్యున్నత స్థాయి అధికారులే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగా సిబిఐకి రాష్ట్రంలో దర్యాప్తు చేయడానికి అనుమతి నిరాకరిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం పేర్కొంది. కనుక ఇకపై సిబిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి దర్యాప్తులు చేయలేదు. అయితే సిబిఐని అడ్డుకొనే అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండవని, ‘సాధారణ సమ్మతి’ అనేది సమాచారం కోసమేనని న్యాయనిపుణులు అంటున్నారు. 


Related Post