కాంగ్రెస్‌ కొంప ముంచుతున్న పొత్తులు

November 15, 2018


img

మహాకూటమి వలన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలుస్తుందో లేదో తెలియదు కానీ పొత్తులలో భాగంగా మూడు పార్టీలకు 25 సీట్లు పంచిపెట్టడం వలన మొదటికే మోసం వచ్చేట్లు ఉంది. మిత్రపక్షాల వలన, ఇతర కారణాల వలన టికెట్లు దక్కనివారు కాంగ్రెస్‌ అధిష్టానంపై ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. 

హైదరాబాద్‌ మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి డిల్లీ వెళ్ళి ఏకంగా రాహుల్ గాంధీ నివాసం ముందే తన భర్తతో కలిసి నిరసన దీక్షకు కూర్చోన్నారు. ఇక రాజేంద్ర నగర్ నుంచి పోటీ చేయాలనుకొన్న సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డికి టికెట్ దక్కక పోవడంతో ఆయన అనుచరులు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తాళాలు వేసి కాంగ్రెస్‌ జెండా దిమ్మను ద్వంసం చేశారు. అనంతరం కార్తీక్ రెడ్డితో సహా అందరూ పార్టీ ప్రాధమిక సభ్యత్వాలకు రాజీనామాలు చేసి వాటిని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపించారు. రాజేందర్ నగర్ నుంచి టికెట్ కేటాయించకపోతే స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తానని కార్తీక్ రెడ్డి ప్రకటించారు. 

ఇక వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన సీనియర్ కాంగ్రెస్‌ నేత నాయిని రాజేందర్ రెడ్డి కూడా తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. చిరకాలంగా కాంగ్రెస్‌ పార్టీ కోసం పని చేస్తున్న తనను కాదని పొత్తులలో భాగంగా టిడిపి నేత రేవూరికి టికెట్ ఇవ్వడాన్ని ఆయన తప్పు పడుతున్నారు. తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా తాను ఈసారి పోటీ చేయడం ఖాయమని చెప్పారు. చెప్పడమే కాకుండా ఈరోజు కాంగ్రెస్‌ తరపున తొలి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. శనివారంలోగా తనకు టికెట్ ఖరారు చేయకపోతే స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ వేస్తానని హెచ్చరించారు. 

ఇక రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ నాయకుడు క్యామ మల్లేశ్‌ కూడా తనకు టికెట్ ఇవ్వనందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కాంగ్రెస్‌ స్క్రీనింగ్ కమిటీ అధ్యక్షుడు భక్త చరణ్‌దాస్ టికెట్లను అమ్ముకొన్నారని ఆరోపించారు. ఇబ్రహీంపట్నం టికెట్ కావాలంటే మూడు కోట్లు ఇవ్వాలని భక్త చరణ్‌దాస్ కుమారుడు సాగర్ తనను ఫోన్లో అడిగాడని ఆరోపించారు. దీనిపై తమ మద్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియో టేపులను కూడా ఈరోజు బయటపెట్టారు. 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గెలుపు గుర్రాలను సమకూర్చమని రాహుల్ గాంధీ పంపిస్తే భక్త చరణ్‌దాస్ టికెట్లు అమ్ముకొన్నారని ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని నమ్ముకొంటే ఆయన తన గొంతు కోశారని క్యామ మల్లేశ్ ఆరోపించారు. కాంగ్రెస్‌ పెద్దలు టికెట్లు అమ్ముకోవడమే కాకుండా దానం నాగేందర్ వంటి వారి నుంచి డబ్బులు తీసుకొని కాంగ్రెస్‌ పార్టీ అవలీలగా గెలుచుకోగల స్థానాలలో బలహీనమైన అభ్యర్ధులను నిలబెట్టి పార్టీని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. 

ఇంకా రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలలో టికెట్ ఆశించి భంగపడినవారు సుమారు 20 మంది కాంగ్రెస్ నేతలు పార్టీకి రాజీనామాలు చేసి స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేయడానికి సిద్దపడుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ పెద్దల బుజ్జగింపులను ఎవరూ వినే పరిస్థితిలో లేరు కనుక రాహుల్ గాంధీయే స్వయంగా పూనుకోవలసివస్తోందంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో రేగిన ఈ అసంతృప్తి జ్వాలలను చూస్తుంటే అవే కాంగ్రెస్ పార్టీని దహించేవేసేలా ఉన్నాయి.


Related Post