కేసీఆర్‌ మొదలుపెట్టిన చోటే బాబు కూడా...

November 08, 2018


img

సిఎం కేసీఆర్‌ వాస్తవిక దృష్టితో ఆలోచించి నిర్ణయాలు తీసుకొంటారని మంచిపేరుంది. అయితే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించినట్లు చెప్పవచ్చు. దేశంలోని అవకాశవాద రాజకీయ పార్టీలతోనే ‘జాతీయ రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు’ సాధిస్తానంటూ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు పూనుకొని చాలా హడావుడి చేశారు. ఆ తరువాత కధ అందరికీ తెలుసు కనుక మళ్ళీ చెప్పుకోనవసరం లేదు. 

అయితే కేసీఆర్‌ ఎక్కడ మొదలుపెట్టారో చంద్రబాబునాయుడు కూడా సరిగ్గా అక్కడే మొదలుపెట్టి, దేశంలో ప్రతిపక్ష పార్టీలను ఒక్క త్రాటిపైకి తీసుకురాగలుగుతుండటమే విశేషం. 

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో కేసీఆర్‌ ముందుకు వెళ్లలేకపోవడానికి, చంద్రబాబు చకచకా ముందుకు సాగడానికి కొన్ని బలమైన కారణాలు కనిపిస్తున్నాయి.

1. దేశంలో అన్ని పార్టీలు అవకాశవాద రాజకీయాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నప్పుడు, సిఎం కేసీఆర్‌ వాటికి అతీతంగా ముందుకు సాగాలనుకొని భంగపడితే, ఆ అవకాశవాద రాజకీయ పార్టీలకు అధికారం సంపాదించుకొనే సులువైన మార్గం చూపుతూ చంద్రబాబు వాటిని ఆకట్టుకోగలుగుతున్నారు. 

2. దేశంలో కాంగ్రెస్‌, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని చెప్పిన కేసీఆర్‌, ప్రధాని నరేంద్ర మోడీతో అంటకాగడం వలన తన విశ్వసనీయత కోల్పోగా, అటువంటి భేషజాలు ఏవీ లేని చంద్రబాబు నిర్మొహమాటంగా తన బద్ద శత్రువైన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి దాని నేతృత్వంలో బిజెపిని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. 

3. దేశంలో రాజకీయ పార్టీలన్నీ కాంగ్రెస్‌, బిజెపిలకు అనుకూలంగానో లేదా వ్యతిరేకంగానో ఉంటాయనే సంగతి కేసీఆర్‌కు తెలియదనుకోలేము. కానీ అది ఆయన గ్రహించనట్లు ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా కూటమి కట్టాలని ప్రయత్నించి భంగపడగా, చంద్రబాబు వాటిలో బిజెపిని వ్యతిరేకిస్తున్న పార్టీలను మాత్రమే కూడగట్టుకొని ముందుకు సాగగలుగుతున్నారు. 

4. కేసీఆర్‌ తాను కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నట్లు ఖరాఖండీగా చెపుతున్నారు కానీ బిజెపి పట్ల నేటికీ మెతక వైఖరి అవలంభిస్తున్నారు. కానీ అదీ ఒప్పుకోవడం లేదు. కనుక ఆయన విశ్వసనీయత ప్రశ్నార్ధకమైంది. అదే...చంద్రబాబు నాయుడు తాను బిజెపిని వ్యతిరేకిస్తున్నానని, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నానని విస్పష్టంగా చెపుతున్నారు. కనుకనే కాంగ్రెస్‌ అనుకూల పార్టీలను ఆయన ఆకట్టుకోగలుగుతున్నారు. 

5. కేసీఆర్‌, చంద్రబాబు నాయుడు ఇద్దరూ తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికే జాతీయస్థాయి రాజకీయాలలో పట్టు అవసరమని భావించారు. అయితే చంద్రబాబు నాయుడు వాస్తవిక రాజకీయ పరిస్థితులను బట్టి కూటమి ఏర్పాటు చేస్తుంటే, కేసీఆర్‌ ప్రధాని మోడీకి అనుకూలంగా ఉంటూ ముందుకు సాగాలనుకోవడం వలన విఫలం చెందినట్లు చెప్పవచ్చు. 

అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెరాస, మార్చి-ఏప్రిల్ నెలలలో జరుగబోయే సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించినట్లయితే, ఎన్నికల తరువాత తెరాస ఎన్డీయే కూటమిలో చేరి జాతీయస్థాయిలో చక్రం తిప్పవచ్చు.


Related Post