వంటేరు వ్యూహంతో తెరాసలో కలకలం

November 08, 2018


img

గజ్వేల్ నియోజకవర్గం నుంచి సిఎం కేసీఆర్‌పై పోటీ చేయబోతున్న కాంగ్రెస్‌ అభ్యర్ధి వంటేరు ప్రతాప్ రెడ్డి చాలా తెలివిగా అమలుచేస్తున్న వ్యూహంతో తెరాస కలవరపడుతోంది. మంత్రి హరీష్ రావు గత నెలరోజులుగా గజ్వేల్ లో పర్యటిస్తూ సిఎం కేసీఆర్‌ తరపున ఉదృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. 

అసలు సిఎం కేసీఆర్‌పై పోటీ చేయాలనుకోవడమే రాజకీయంగా ఆత్మహత్యతో సమానం. ఇక హరీష్ రావు వంటి మంచి ప్రజాధారణ ఉన్న నేత గజ్వేల్ లో ఎన్నికల ప్రచారం చేస్తుంటే తనకు డిపాజిట్లు కూడా దక్కవని వంటేరు ప్రతాప్ రెడ్డి ఆందోళన చెందితే ఆశ్చర్యమేమీ లేదు. కనుక ముందుగా హరీష్ రావును గజ్వేల్ నుంచి బయటకు పంపించడానికి వంటేరు పొగ పెట్టడం ప్రారంభించారు. 

ఆ వ్యూహంలో భాగంగా, "తాను కేసీఆర్‌ వైఖరితో విసిగిపోయున్నానని, ఆయనను ఓడించడానికి అవసరమైతే ఆర్ధికసహాయం చేస్తానని మంత్రి హరీష్ రావు తనకు ఫోన్ చేసి చెప్పారని" వంటేరు చేసిన ప్రకటనతో తెరాసలో కలకలం మొదలైంది. వెంటనే తెరాస నేతలు వంటేరుపై ఎన్నికల ప్రధానాధికారికి పిర్యాదు చేయడం గమనిస్తే, ఆయన చీకటిలో విసిరిన రాయి సరిగ్గా తగలవలసిన చోటే తగిలిందని అర్ధమవుతుంది.

ఇది గ్రహించిన వంటేరు తన వ్యూహానికి మరింత పదునుపెట్టి తాజాగా హరీష్ రావుపై మరిన్ని ఆరోపణలు చేశారు. ఒకపక్క హరీష్ రావు గొప్ప మేధావి, మంచి రాజకీయ అనుభవజ్నుడు, రాష్ట్ర స్థాయి నేత అని పొగుడుతూనే అటువంటి గొప్ప నేత సిఎం కేసీఆర్‌ ఆజ్ఞను ధిక్కరించలేక తన వంటి గ్రామస్థాయి నాయకుడిని ఎదుర్కోవడానికి గజ్వేల్ లో తిష్ట వేశారని ఆరోపించారు. ఆయన కేసీఆర్‌కు జీతగాడిగా మారిపోయి గజ్వేల్ లోనే ఎన్నికల ప్రచారానికి పరిమితం అయిపోయారని ఎద్దేవా చేశారు. 

కొంత కాలం క్రితం మంత్రి హరీష్ రావు, తాను హైదరాబాద్‌లో రెండుసార్లు కలిసి మాట్లాడుకొన్నామని చెప్పి వంటేరు మరో బాంబు పేల్చారు. తాను చెపుతున్న వాటికి తనవద్ద సాక్ష్యాధారాలున్నాయని వాటిని తగిన సమయంలో బయటపెడతానని అన్నారు. తాను చెపుతున్నవి నిజమని ఏ దేవుడిపైనైనా తాను ప్రమాణం చేయడానికి సిద్దమని హరీష్ రావు కూడా ప్రమాణం చేయగలరా? అని వంటేరు ప్రతాప్ రెడ్డి సవాలు విసిరారు. 

వంటేరు చేసిన ఈ తాజా ఆరోపణలపై తెరాస నేతలు ధీటుగానే స్పందించవచ్చు. అయితే వంటేరు అమలుచేస్తున్న ఈ వ్యూహం ఫలించి మంత్రి హరీష్ రావు గజ్వేల్ లో ప్రచారం నిలిపివేసి వెళ్లిపోతారా లేక వంటేరు వ్యూహానికి ఏదైనా ప్రతివ్యూహం అమలుచేసి చిత్తు చేస్తారో చూడాలి.


Related Post