తెరాస వాదన నిజమని నిరూపిస్తూ...

November 08, 2018


img

మహాకూటమిని గెలిపిస్తే తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని అమరావతికి, డిల్లీకి తాకట్టు పెట్టినట్లేనని, తెలంగాణ ప్రభుత్వాన్ని చంద్రబాబునాయుడు, డిల్లీ పెద్దలు నియంత్రించడం మొదలుపెడతారని తెరాస వాదిస్తోంది. ఆవిధంగా జరుగుతుందో లేదో తెలియదు కానీ కాంగ్రెస్‌ నేతలు తమ పార్టీ అభ్యర్ధుల పేర్లను ఖరారు చేసుకోవడానికి డిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటే, టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ చంద్రబాబు నాయుడును కలిసేందుకు గురువారం ఉదయం అమరావతికి బయలుదేరడం గమనిస్తే తెరాస వాదన నిజమయ్యే అవకాశం ఉందనిపించకమానదు. 

కాంగ్రెస్‌ అధిష్టానం డిల్లీలో, టిడిపి అధిష్టానం అమరావతిలో ఉన్నందున ఆ పార్టీల నేతలు కీలక నిర్ణయాలు తీసుకోవడాని డిల్లీ, అమరావతి వెళ్ళడం తప్పుకాదు. కానీ “చిరకాలం పరాయిపాలనలో మగ్గిన తెలంగాణ ప్రజలు స్వపరిపాలన చేసుకొందామని పోరాడి సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ డిల్లీకి, అమరావతికి అప్పగించేయాలా?ఇందుకోసమేనా పోరాటాలు చేసింది? ఇందుకోసమేనా బలిదానాలు చేసింది?” అనే తెరాస వాదనలకు బలం చేకూర్చుతున్నాయి కాంగ్రెస్‌, టిడిపి నేతల డిల్లీ, అమరావతి పర్యటనలు. 

ఆ రెండు పార్టీల రాష్ట్ర నేతలు కనీసం తమ పార్టీల అభ్యర్ధుల పేర్లను రాష్ట్ర స్థాయిలో ఖరారు చేసుకొనే స్వతంత్రం, అధికారం లేనప్పుడు, రేపు ఒకవేళ అధికారంలోకి వస్తే ప్రభుత్వాన్ని ఏవిధంగా నడపగలరు?అని ప్రజలు ఆలోచిస్తే డిసెంబరు 7న జరుగబోయే ఎన్నికలలో వారు ఎటువైపు మొగ్గుతారో తేలికగానే ఊహించుకోవచ్చు. 


Related Post