హరీశ్‌కు రోజూ శీలపరీక్ష అవసరమా? కేటిఆర్‌

November 07, 2018


img

తెరాస పార్టీలో...ప్రభుత్వంలో మంత్రి హరీష్ రావుకు అన్యాయం జరుగుతోందని, కనుక తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన ఈ ఎన్నికలలో హాంగ్ అసెంబ్లీ ఏర్పడితే తన వర్గంతో కలిసి తెరాస నుంచి బయటకు వచ్చేస్తారని కాంగ్రెస్‌, టిడిపి నేతలు చేస్తున్న వాదనలు తెరాసలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 

వాటిపై స్పందించిన మంత్రి కేటిఆర్‌ “మాకు మా కుటుంబాలు, దృడమైన బందుత్వాల కంటే ఈ పదవులు, రాజకీయాలు ముఖ్యం కాదు. మరో 15 ఏళ్ళు వరకు సిఎం కేసీఆరే ఈరాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని మేమందరం కోరుకొంటున్నాము. కనుక తెరాసలో కేసీఆర్ తప్ప మరొకరు ముఖ్యమంత్రి అభ్యర్ధి లేరు. మళ్ళీ మా ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆయన మాకు తన మంత్రివర్గంలో ఏవైనా బాధ్యతలు అప్పగిస్తే స్వీకరిస్తాము. వద్దు...పార్టీ బాధ్యతలే చూసుకోమని చెపితే అదే తీసుకొంటాము. ఒకవేళ మా ఇద్దరి అవసరం లేదని ఆయన చెపితే రాజకీయాల నుంచి సంతోషంగా తప్పుకొంటాము.  అయినా ‘నా పుట్టుక... నా చావు రెండూ తెరాసలోనే’ అని మంత్రి హరీష్ రావు నిర్ద్వందంగా చెప్పిన తరువాత కూడా ప్రతిపక్ష నేతలు ఆయన గురించి చాలా నీచంగా మాట్లాడుతున్నారు. కేసీఆర్‌ పట్ల గౌరవాన్ని, తెరాస పట్ల తన విధేయతను చాటుకోవడానికి ఆయన ఇంతకంటే ఏమి చెప్పగలరు?

అయినా ఆయనకు రోజూ శీలపరీక్ష అవసరమా? కాంగ్రెస్‌ నేతలు ఇటువంటి ఆరోపణలతో మాపార్టీలో చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇటువంటి ‘చీప్ ట్రిక్స్’ మేము అర్ధం చేసుకోలేని దుస్థితిలో లేము. ఈ ఆరోపణలను నేను ఖండిస్తున్నాను. మంత్రి హరీష్ రావుపై కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ఈ తప్పుడు ఆరోపణలను ఎవరూ విశ్వసించరు.

ఇక పార్టీలో ప్రభుత్వంలో నాకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోందనే వార్తలు మీడియా సృష్టించినవే తప్ప నిజం కాదు. ఊహాజనితమైన అటువంటి వాటికి నేను సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. మా పార్టీలో కష్టపడి పనిచేసే వారందరికీ తగిన అవకాశాలు లభిస్తాయి కనుక అందరూ ఎవరిపని వారు చేసుకొంటున్నాము,” అని అన్నారు. 


Related Post