1+1=2 కాదు...జీరో కూడా కావచ్చు: కేటిఆర్‌

November 07, 2018


img

మంత్రి కేటిఆర్‌ మహాకూటమిలో సీట్ల సర్దుబాట్లు, వాటి లెక్కలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిన్న హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “గత రెండు నెలలుగా మహాకూటమిలో సీట్ల పంచాయితీ నడుస్తూనే ఉంది. నామినేషన్లు వేయడానికి సమయం దగ్గర పడుతున్నా ఇంకా ఆ పంచాయితీ తేలలేదు. మహాకూటమి పరిస్థితి చూస్తుంటే నివురు గప్పిన నిప్పులా ఉంది. ఏ క్షణం ఏ పార్టీ బయటకు వెళ్లిపోతుందో తెలియదు. ఇంతవరకు సీట్ల పంపకాలే చేసుకోలేకపోతున్న మహాకూటమిని చూసి ప్రజలు కూడా నవ్వుకొంటున్నారు. మహాకూటమి అభ్యర్ధుల జాబితా ప్రకటించిన తరువాత మా పార్టీ మరింత బలపడుతుందని భావిస్తున్నాము. 

రెండు నెలల క్రితమే ఒకేసారి 105 మంది అభ్యర్ధులను ప్రకటించి సిఎం కేసీఆర్‌ ప్రతిపక్షాలకు పెద్ద షాక్ ఇచ్చారు. దాంతో కేసీఆర్‌ను ఒంటరిగా ఎదుర్కొలేమని గ్రహించిన కాంగ్రెస్‌ పార్టీ మహాకూటమిని ఏర్పాటు చేసుకొంది. నాలుగు పార్టీలు చేతులు కలిపి మహాకూటమిని ఏర్పాటు చేసుకొన్నట్లయితే వాటిలో కాంగ్రెస్‌ పోటీ చేయనిచోట దాని ఓట్లు టిడిపికి, అలాగే టిడిపి ఓట్లు కాంగ్రెస్ పార్టీకి, టిజేఎస్ ఓట్లు సిపిఐకి బదిలీ అవుతాయనుకొంటున్నాయి. కానీ రాజకీయాల్లో 1+1=2 కాకపోవచ్చు లేదా సున్నా అయినా కావచ్చు. మహాకూటమికి ఈసారి ఎన్నికలలో ఎన్ని సీట్లు వస్తాయో కాదు ఎన్ని సున్నాలు వస్తాయో చూడాలి. 

ఈసారి ఎన్నికలలో మొత్తం 119 నియోజకవర్గాలలో పోటీ చేస్తామని గొప్పలు చెప్పుకొన్నా తెలంగాణ జనసమితి కేవలం 3-4 సీట్ల కోసం కాంగ్రెస్ నేతల ముందు పొర్లు దండాలు పెడుతున్నారు. ఆ నాలుగు సీట్ల కోసం మళ్ళీ ఒక మేనిఫెస్టో కూడా ఉందట! సిద్దిపేట, దుబ్బాక, చాంద్రాయణగుట్ట నుంచి టిజేఎస్ పోటీ చేయబోతోందని విన్నాను. అంటే దానార్ధం పోచమ్మ గుడి ముంగిట గొర్రెను కట్టేసినట్టేనని భావిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీలో అందరూ ఉత్తర కుమారులే ఉన్నారు కనుకనే మహాకూటమిని చంద్రబాబు నాయుడు అదుపు చేయగలుగుతున్నారు,” అని అన్నారు. 


Related Post