నా విధేయతే నన్ను కాపాడింది: రాజయ్య

October 23, 2018


img

2014 ఎన్నికల తరువాత తెరాస ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వంటి రెండు కీలకపదవులను దక్కించుకొన్న తాటికొండ రాజయ్య అవినీతి ఆరోపణలతో ఆ రెండు పదవులు కోల్పోవడం, అప్పటి నుంచి ఆయన పూర్తిగా ‘సైలెంట్ మోడ్’లోకి వెళ్ళిపోవడం అందరికీ తెలుసు. కానీ తెరాస మొదటి జాబితాలోనే ఆయన పేరు మళ్ళీ కనబడటంతో అందరూ షాక్ అయ్యారు. ముఖ్యంగా స్థానిక పార్టీ నేతలు కొందరు ఆయనకు టికెట్ ఇవ్వడాన్ని బహిరంగంగానే వ్యతిరేకించేరు. కానీ ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా రాజయ్యను మార్చేది లేదని సిఎం కేసీఆర్‌ స్పష్టం చేయడం కూడా విశేషమేనని చెప్పవచ్చు.       

స్టేషన్ ఘన్‌పూర్‌ నుంచి మళ్ళీ టికెట్ సంపాదించుకొన్న రాజయ్య ఒక ప్రముఖ తెలుగు మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడుతూ, “నా అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పదవులు లభించడం, ఆరు నెలలోనే వాటిని పోగొట్టుకోవడం జరిగింది. ఆ కొద్దిపాటి సమయంలోనే నేను రాష్ట్రంలో సామాన్య ప్రజలకు వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేశాను. కానీ అనుకోని విధంగా మంత్రి పదవులను కోల్పోయాను. కానీ అందుకు నేను పార్టీ అధిష్టానాన్ని నిందించలేదు. మంత్రిపదవి పోతే పోయింది ఎమ్మెల్యేగా ప్రజల మద్య ఉంటూ పనిచేసుకొనే అవకాశం లభించిందని భావించి, ఈ నాలుగున్నరేళ్ళలో నా నియోజకవర్గం అభివృద్ధికి చేయగలిగినంతా చేశాను. నా పనితీరు, నా విధేయతే నాకు మళ్ళీ ఈ అవకాశాన్ని తెచ్చిపెట్టాయని భావిస్తున్నాను. ఏ అభ్యర్ధికైనా అసమ్మతి తప్పదు. నాకు తప్పలేదు. అయితే సిఎం కేసీఆర్‌పై నమ్మకముంచి నాపని నేను చేసుకుపోతున్నాను. ఆయన ఆదేశంతో మంత్రి కేటిఆర్‌గారు అసమ్మతివాదులతో మాట్లాడి నా గెలుపుకు కృషి చేయాలని ఒప్పించారు. ఇప్పుడు అంతా చక్కబడింది. కనుక అందరం కలిసి ఎన్నికల ప్రచారం చేసుకొంటున్నాము,” అని చెప్పారు. 


Related Post