మహాకూటమిపై కోదండరామ్ తాజా వ్యాఖ్యలు

October 22, 2018


img

సుమారు నెలరోజులుగా మహాకూటమిలో భాగస్వామ్య పార్టీల మద్య సీట్లసర్దుబాట్లపై చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు. ఇంతకు ముందు కోదండరామ్ 48 గంటలు డెడ్-లైన్ విధించగా, తరువాత జానారెడ్డి ఈనెల 27లోగా అభ్యర్ధుల జాబితాలను ప్రకటిస్తామని కొత్త డెడ్-లైన్ ప్రకటించారు. 

మహాకూటమిలో సీట్లసర్దుబాట్లు పూర్తికాకపోవడానికి ప్రొఫెసర్ కోదండరామ్ మొండి పట్టుదలే కారణమని మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా మీడియా కూడా ఆయననే గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తుండటంతో ఆయన అసహనానికి గురవడం సహజమే. ఆయన మళ్ళీ ఇవాళ్ళ కూడా మహాకూటమి గురించి మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పవలసి వచ్చింది. 

“సిఎం కేసీఆర్‌ నిరంకుశపాలన అంతమొందించి, రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికే మహాకూటమి ఏర్పడింది. సీట్లసర్దుబాట్ల విషయంలో మామద్య చీలికలు వచ్చాయని మీడియాలో వస్తున్న వార్తలు నిజం కావు. తెరాసను గద్దె దించాలనే ఒకే లక్ష్యంతో చేతులు కలిపిన మేము, ఏది ఏమైనప్పటికీ మహాకూటమిలోనే ముందుకు సాగాలని భావిస్తున్నాము. అయితే ఈ ఐక్యతను నిలుపుకోవడానికి కాంగ్రెస్ పార్టీ త్వరగా నిర్ణయాలు తీసుకోవలసి ఉంది లేకుంటే మహాకూటమిలో కుప్పకూలిపోయే ప్రమాదం ఉంటుంది. మహాకూటమిలో భాగస్వామ్య పార్టీలతో సర్దుబాట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ గందరగోళంలో ఉన్నట్లు కనబడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఎంత త్వరగా దాని నుంచి బయటపడి నిర్ణయాలు తీసుకొంటే అంత మంచిది,” అని అన్నారు. 

ప్రొఫెసర్ కోదండరామ్ ఏవిధంగా చెప్పినప్పటికీ, మహాకూటమి ముందుకు సాగలేకపోవడానికి కారణం తాను కానని కాంగ్రెస్ పార్టీయేనని చెప్పకనే చెపుతున్నట్లుంది.


Related Post