తెరాస-మహాకూటమి ఎవరి లెక్కలు వారివే!

October 22, 2018


img

సిఎం కేసీఆర్‌ తమ పార్టీ మేనిఫెస్టోలో నిరుద్యోగభృతి, పంట రుణాల మాఫీ, పెన్షన్ల మొత్తం పెంపు వంటి ముఖ్యాంశాలను ప్రకటించిన తరువాత తెరాస పట్ల ప్రజలలో మరింత ఆధరణ పెరిగిందని, ఇదివరకు తెరాసకు 60 శాతం అనుకూలంగా ఉండగా, ఇప్పుడు ఒకేసారి అది 70-75 శాతానికి పెరిగిందని, ఈసారి ఎన్నికలలో 100కు పైగా సీట్లు గెలుచుకోవడం ఖాయమని సిఎం కేసీఆర్‌ తన పార్టీ అభ్యర్ధులకు నిన్న ఆదివారమే చెప్పారు. వివిద రకాలుగా సర్వేలు చేయించుకొన్న తరువాత దీనిని నిర్ధారించుకొన్నట్లు సిఎం కేసీఆర్‌ చెప్పారు. 

అయితే మహాకూటమి వాదన ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఈరోజు నాగోల్‌లోని బండ్లగూడలో జరిగిన ఓ కార్యక్రమంలో మహాకూటమి నేతలు అందరూ పాల్గొన్నప్పుడు, టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ మీడియాతో మాట్లాడుతూ, “శాసనసభను రద్దు చేసినప్పటి నుంచి ఈ 45 రోజులలోనే తెరాస గ్రాఫ్ 60 నుంచి 30కు పడిపోయింది,” అని చెప్పడం విశేషం.         

తెరాస గ్రాఫ్ విషయంలో ఇరుపక్షాల వాదనలలో కొంత సహేతుకత ఉందని చెప్పవచ్చు. తెరాసకు అది అమలుచేసిన సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామరక్ష అని చెప్పవచ్చు. గత ప్రభుత్వాలు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేవని అందరికీ తెలుసు. అయితే వాటి అమలులో చిత్తశుద్ది లోపించడం,అవినీతి, అసమర్ధత, నిర్లక్ష్యం చోటు చేసుకోవడం వలన అవి ఆశించిన ఫలితాలు ఇచ్చేవి కావు. ఆ కారణంగా సంక్షేమ పధకాలు అంటే ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని వృధా పధకాలని, అవి ఎన్నికలలో ప్రకటించడానికి మాత్రమే పనికివస్తాయనే అభిప్రాయం ప్రజలలో నెలకొని ఉండేది. 

కానీ తెరాస ప్రభుత్వం రాష్ట్రంలో వివిద వర్గాల ప్రజల ప్రత్యేక అవసరాలను, సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించి వాటి అమలుకు మంచి యంత్రాంగం, నిధులు, సమర్ధమైన పర్యవేక్షణ కల్పించడంతో దాదాపు 80-90 శాతం పధకాలు విజయవంతంగా నడుస్తూ ఆశించిన ఫలితాలు ఇస్తున్నాయని చెప్పవచ్చు. ఇక తెలంగాణ రైతు సమన్వయసమితి పేరిట సుమారు 50 లక్షల మంది రైతులను, వారి కుటుంబాలను తెరాసకు అనుకూలంగా మలుచుకోగలిగింది. ఆ పధకాల వలన లబ్ధి పొందుతున్నవారు అందరూ తెరాసకు ఓటు బ్యాంకుగా మారినట్లు భావించవచ్చు. కనుక ఇటీవల సిఎం కేసీఆర్‌ కొత్తగా ప్రకటించిన హామీలతో తెరాస గ్రాఫ్ పెరగడం సహజమే. 

ఇక మహాకూటమి వాదన ప్రకారం చూస్తే, ఐదేళ్లు పాలించమని కేసీఆర్‌కు అధికారం కట్టబెడితే, రాష్ట్రంలో ఎటువంటి తీవ్ర సమస్యలు లేనప్పటికీ తెరాస రాజకీయ ప్రయోజనాల కోసమే సిఎం కేసీఆర్‌ సుమారు 9 నెలల ముందుగా శాసనసభను ఏకపక్షంగా రద్దు చేసి ఎన్నికలకు వెళ్లడాన్ని ప్రజాస్వామ్యవాదులెవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. సామాన్య ప్రజలు...ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు ‘సిఎం కేసీఆర్‌ అంత హటాత్తుగా శాసనసభను ఎందుకు రద్దు చేశారు? దానికి కారణమేమిటి? ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళుతున్నారు?’ అని ప్రశ్నిస్తున్నారు. కానీ సిఎం కేసీఆర్‌తో సహా తెరాస మంత్రులు, నేతలు ఎవరూ సంతృప్తికరమైన సమాధానం చెప్పకపోవడంతో ప్రజలలో తెరాస పట్ల కొంత అసహనం నెలకొని ఉన్నమాట వాస్తవం. సిఎం కేసీఆర్‌ నిరంకుశత్వ పాలన సాగిస్తూ, ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారనే ప్రతిపక్ష పార్టీల ఆరోపణలకు శాసనసభ రద్దు, ముందస్తు ఎన్నికల నిర్ణయం మరింత బలం చేకూర్చినట్లయింది. ఈ కారణంగా తెరాస గ్రాఫ్ కొంత పడిపోయి ఉంటే ఆశ్చర్యం లేదు.

 అయితే, తెరాస, మహాకూటమిలో ఎవరి లెక్కలు, అంచనాలు నిజమవుతాయో తెలియాలంటే డిసెంబర్ 11 వరకు వేచి చూడాల్సిందే.


Related Post