ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి: సిఎం కేసీఆర్‌

October 22, 2018


img

సిఎం కేసీఆర్‌ ఈ నెలాఖరులోగా మళ్ళీ ఎన్నికల ప్రచారసభలు నిర్వహించబోతున్నారు. తెలంగాణభవన్‌లో ఆదివారం పార్టీ అభ్యర్ధులతో సమావేశమైనప్పుడు ఈవిషయం ప్రకటించారు. కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాలలో ఈ నెలాఖరులోగా మళ్ళీ ఎన్నికల ప్రచారసభలు నిర్వహిస్తానని, నవంబర్ నెల నుంచి నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించుకొందామని సిఎం కేసీఆర్‌ చెప్పారు. అప్పటికి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా తమ అభ్యర్ధులను ప్రకటిస్తాయి కనుక ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరుతుంది. 

నిన్నటి సమావేశంలో సిఎం కేసీఆర్‌ పార్టీ అభ్యర్ధులకు ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఆకర్షించడానికి అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. అభ్యర్ధులు భారీ ఊరేగింపులు నిర్వహిస్తూ ప్రజలకు మొక్కుబడిగా దండాలు పెట్టుకొంటూ ముందుకు సాగిపోవడం వలన ఏ ఉపయోగం ఉండదని, వీలైనంతవరకు ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి, ఓటు వేయాలని కోరాలని సిఎం కేసీఆర్‌ సూచించారు. 

అలాగే గత నాలుగేళ్ళలో తెరాస ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ పధకాల గురించి అభ్యర్ధులందరికీ వివరించి వాటికి సంబందించిన పత్రాలను కూడా అభ్యర్ధులందరికీ అందజేసినట్లు సమాచారం. అభ్యర్ధులు అందరూ తమ ఎన్నికల ప్రచారంలో ఆ వివరాల ఆధారంగా ప్రభుత్వపధకాల గురించి తప్పనిసరిగా ప్రజలకు అర్ధమయ్యేవిధంగా వివరించాలని సిఎం కేసీఆర్‌ ఆదేశించారు. 

ఇటీవల తెరాస మేనిఫెస్టోలో ముఖ్యాంశాలను ప్రకటించిన తరువాత జరిపించిన వివిద సర్వేలలో ఈసారి ఎన్నికలలో తెరాసకు 75 శాతంపై ఓట్లు పడతాయని, 100కు పైగా సీట్లు గెలుచుకోవడం ఖాయమని తేలిందని చెప్పారు. ఈసారి ఎన్నికలలో తెరాస విజయం దేశ చరిత్రలో ఒక రికార్డుగా నిలిచిపోబోతోందని సిఎం కేసీఆర్‌ చెప్పారు. రాష్ట్రంలో తెరాసకు అత్యంత అనుకూలమైన రాజకీయ వాతావరణం నెలకొని ఉందని, ఈ అవకాశాన్ని అభ్యర్ధులు అందరూ సద్వినియోగం చేసుకొని భారీ మెజార్టీతో గెలిచేందుకు గట్టిగా కృషి చేయాలని సిఎం కేసీఆర్‌ చెప్పారు.


Related Post