రాహుల్ గాంధీకి కేటిఆర్‌ జవాబు అదుర్స్

October 20, 2018


img

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన అవినీతి ఆరోపణలకు మంత్రి కేటిఆర్‌ గణాంకాలతో సహా చాలా చక్కగా హుందాగా జవాబిచ్చిన తీరు మెచ్చుకోవలసిందే. రాష్ట్రంలో నిర్మింపబడుతున్న సాగునీటి ప్రాజెక్టులను రీ-డిజైనింగ్ పేరుతో రూ.40,000లతో పూర్తయ్యేవాటిని సిఎం కేసీఆర్‌ ప్రభుత్వం లక్ష కోట్లకు పెంచేసి ఆ సొమ్మును దిగమింగేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. 

దానికి మంత్రి కేటిఆర్‌ ఏమని జవాబు చెప్పారంటే, “గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు అంచనాలను మూడేళ్ళ వ్యవధిలో రూ.17,000 కోట్లు నుంచి 40,000 కోట్లకు పెంచేసింది. తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్ర భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాజెక్టును రీ-డిజైన్ చేయించిన మాట వాస్తవం. ఆ ప్రాజెక్టు అంచనా రూ.80,190 కోట్లకు పెరిగిన మాట వాస్తవం. దానిని సిడబ్ల్యూసి కూడా ఆమోదించింది. అయితే రూ.40,000 కోట్ల ప్రాజెక్టు వ్యయం ఒకేసారి రూ.80,190 కోట్లకు ఏవిధంగా పెరిగిందో రాహుల్ గాంధీకి, కాంగ్రెస్‌ నేతలకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ ప్రజలకు వివరించవలసిన బాధ్యత మాపై ఉంది. ఆ ప్రాజెక్టు అంచనా వ్యయం రెట్టింపు అవడానికి గల కారణాలు: 

1. గతంలో యూపీయే ప్రభుత్వ హయాంలో తెచ్చిన భూసేకరణ చట్టం-2013 బిల్లు కారణంగా రాష్ట్రంలో భూసేకరణపై చేయవలసిన ఖర్చు మూడు, నాలుగు రెట్లు పెరిగింది. ఇంతకు ముందు ఎకరానికి రూ.2-3 లక్షలు చెల్లిస్తే, ఆ చట్టం అమలులోకి వచ్చిన తరువాత ఇప్పుడు ఎకరానికి కనీసం రూ.6-12 లక్షలు చెల్లించవలసి వస్తోంది. 

2. కాంగ్రెస్‌ హయాంలో కేవలం 16 టిఎంసీల నిలువ సామర్ధ్యం ఉండేవిధంగా రూపొందించబడిన ఆ ప్రాజెక్టును రాష్ట్ర భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని 160 టిఎంసీల నిలువ సామర్ధ్యం ఉండేవిధంగా రీ-డిజైన్ చేశాము. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా రాష్ట్రంలో వరుసగా రెండు మూడేళ్లు కరువు వచ్చినా రైతులు పంటలు పండించుకొనేందుకు నిరంతరంగా నీళ్ళు అందించాలనే ఉద్దేశ్యంతోనే ప్రాజెక్టు సామర్ధ్యాన్ని పెంచాము.

3. ఈ ప్రాజెక్టులో ఆధనంగా 3 బ్యారేజీలు, 3 పంపు హౌసులను నిర్మిస్తున్నాము. 

4. జిఎస్టి పన్ను భారం. 

ఈ నాలుగు ప్రధాన కారణాల చేత ఈ ప్రాజెక్టు (కాళేశ్వరం ప్రాజెక్టు) అంచనాలు రెట్టింపు అయ్యాయి తప్ప అవినీతి కారణంగా కాదని రాహుల్ గాంధీగారు తెలుసుకోవలసిందిగా విజ్నప్తి చేస్తున్నాను. సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడేటప్పుడు రాహుల్ గాంధీ వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకొని, గణాంకాల ఆధారంగా మాట్లాడితే బాగుంటుంది కానీ ఈవిధంగా నోటికి వచ్చినట్లు మాట్లాడితే తెలంగాణ ప్రజలు కూడా నమ్మే పరిస్థితి ఉండదని తెలియజేస్తున్నాను,” అని అన్నారు.


Related Post