అయ్యో బిజెపిని ఎంతమాటనేసింది రాములమ్మ

October 18, 2018


img

కాంగ్రెస్‌ స్టార్ కెంపెయినర్ విజయశాంతి గురువారం మీడియాతో మాట్లాడుతూ బిజెపి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “నిజమే. ఒకప్పుడు తెలంగాణలో బిజెపి చాలా బలంగా ఉండేది కానీ ఇప్పుడు కాదు. రాష్ట్రంలో ఆ పార్టీ తన ఉనికిని కోల్పోయి చాలా కాలమే అయ్యింది. కనుక రాష్ట్ర స్థాయిలో దానితో మాకు ఎటువంటి పోటీ లేదు. మాపోటీ తెరాసతోటే. అయితే జాతీయస్థాయిలో మాత్రం బిజెపితోనే మాకు పోటీ ఉంటుంది. కానీ మోడీ ప్రభుత్వం ఇప్పటికే పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి అనేక ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకొంది. అలాగే , పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటుతున్నయ ఏమాత్రం పట్టించుకోకపోవడంతో సామాన్య ప్రజల జీవితం నానాటికీ దుర్బరమైపోతోంది. కనుక వచ్చే లోక్ సభ ఎన్నికలలో బిజెపికి ఓటమి తప్పదు. కేంద్రంలో మా యూపీయే కూటమి అధికారంలోకి రావడం ఖాయం. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం తధ్యం,” అని అన్నారు. 

ఇక రాష్ట్రంలో కాంగ్రెస్‌ చేతిలో తెరాస ఓటమి తప్పదని అన్నారు. సిఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యులు నలుగురూ కలిసి రూ.30,000 కోట్లు అవినీతికి పాల్పడ్డారని, గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలుచేయకుండా మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతూ కాలక్షేపం చేశారని విజయశాంతి ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబ అవినీతితో ప్రజలు విసుగెత్తిపోయున్నారని కనుక డిసెంబరు 7న జరుగబోయే ఎన్నికలలో ప్రజలు తెరాసకు తగిన గుణపాఠం చెప్పబోతున్నారని విజయశాంతి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.


Related Post