మోడీతో కేసీఆర్‌ స్నేహం దేనికంటే... జైపాల్ రెడ్డి వివరణ

October 16, 2018


img

కాంగ్రెస్‌ సీనియర్ నేత జైపాల్ రెడ్డి సోమవారం గాంధీ భవన్‌లో మీడియా సమావేశంలో సిఎం కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులు, తెరాస నేతలపై చాలా తీవ్ర ఆరోపణలు చేశారు. “రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం మొదలుపెట్టిన కాళేశ్వరం, మిషన్‌ భగీరథ, పాలేరు, సీతారామ, డిండి మొదలైన ప్రాజెక్టులన్నీ ఆంధ్రాకు చెందిన కాంట్రాక్టర్లకు అప్పగించారు.

ఆ ప్రాజెక్టులలో సుమారు 30 శాతం అంచనాలను పెంచి ఆంధ్రాకు చెందిన ఒక సంస్థకు రూ.60,436 కోట్ల విలువైన పనులను, మరో సంస్థకు రూ.17,000 కోట్ల విలువైన పనులను అప్పగించారు. వాటి నుంచి సిఎం కేసీఆర్‌ నేరుగా 6 శాతం కమీషన్ తీసుకొంటున్నారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు, తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా భారీగా కమీషన్లు అందుకొంటున్నారు.

ఈ కమీషన్ల కోసం ఆశపడే రూ.50,000 కోట్లతో పూర్తికాగల ఆ ప్రాజెక్టుల అంచనాలను సుమారు రూ.27,000 కోట్లు పెంచి ఆంధ్రా కాంట్రాక్టర్లకు అప్పగించారు. సిఎం కేసీఆర్‌ తదితరులపై నేను చేస్తున్న ఈ ఆరోపణలకు నావద్ద బలమైన సాక్ష్యాధారాలున్నాయి. ఈ ఆరోపణలకు నేను కట్టుబడి ఉన్నాను. వీటిపై సిఎం కేసీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.

ఈ అవినీతి, అక్రమార్జనల కారణంగానే తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ సిఎం కేసీఆర్‌కు కట్టుబానిసలుగా మారిపోయీ ఆయన ఏమి చేసినా సహించవలసివస్తోంది.

మేము ఆంధ్రాకు చెందిన టిడిపితో పొత్తులు పెట్టుకోవడాన్ని తప్పు పడుతున్న సిఎం కేసీఆర్‌, తెరాస మంత్రులు, మరి మీరు అదే ఆంధ్రా కాంట్రాక్టర్లకు తెలంగాణ ప్రజల సొమ్మును దోచిపెడుతున్న మాట వాస్తవమా కాదా? వారి దగ్గర నుంచి కమీషన్లు పిండుకొన్న మాట వాస్తవమా కాదా?

వారితో మీరు అంటకాగుతూ, రాజకీయ పొత్తులు పెట్టుకొన్న మమ్మల్ని విమర్శించడం సిగ్గుచేటు. మిగులు బడ్జెట్ తో కేసీఆర్‌ చేతికి అందిన తెలంగాణ రాష్ట్రాన్ని ఈ అవినీతి, అక్రమాలతో రూ.2 లక్షల అప్పులలో ముంచేశారు.     రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ అవినీతిపై విచారణ జరిపిస్తాము. అప్పుడు కేసీఆర్‌ విచారణ ఎదుర్కొక తప్పదు,” అని జైపాల్ రెడ్డి అన్నారు.

ఇక సిఎం కేసీఆర్‌-మోడీ స్నేహం గురించి కూడా జైపాల్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే తనకు ఇటువంటి సమస్యలు వస్తాయనే భయంతోనే సిఎం కేసీఆర్‌ ప్రధాని నరేంద్ర మోడీతో స్నేహంగా ఉంటూ అవసర సమయాలలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారు,” అని జైపాల్ రెడ్డి వివరించారు.  

జైపాల్ రెడ్డి చేసిన ఈ తీవ్ర ఆరోపణలపై తెరాస ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. 


Related Post