ఎన్నికల తరువాత కేసీఆర్‌ పరిస్థితి ఏమిటి? జైపాల్ రెడ్డి

October 15, 2018


img

సీనియర్ కాంగ్రెస్‌ నేత జైపాల్ రెడ్డి సిఎం కేసీఆర్‌ను ఉద్దేశ్యించి ఇవాళ్ళ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. “సిఎం కేసీఆర్‌ గత నాలుగేళ్ళలో ఏమి చేశారని అంతగా గొప్పలు చెప్పుకొంటున్నారు. రాష్ట్రంలో వచ్చేది మా ప్రభుత్వమే. మేము రాష్ట్రంలో అధికారంలోకి రాగానే తెరాస అవినీతి మేతపై విచారణ జరిపిస్తాము. కనుక ఎన్నికల తరువాత కేసీఆర్‌ పరిస్థితి ఏవిధంగా ఉండబోతోందో ఓసారి ఆలోచించుకొంటే మంచిదేమో?” అని అన్నారు.

ఒకవేళ జైపాల్ రెడ్డి చెప్పినట్లు తెరాస ఓడిపోతే ఏమవుతుంది? కేసీఆర్‌తో సహా గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ ప్రతిపక్ష బెంచీలలో కూర్చొని ప్రజాకూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తుంటారు. అంతే!

ఒకవేళ ఈ ఎన్నికలలో ప్రజాకూటమి ఓడిపోయినట్లయితే, కాంగ్రెస్‌ పార్టీలో చాలా మంది సీనియర్లు రాజకీయ సన్యాసం చేయక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడవచ్చు. వచ్చే ఎన్నికలనాటికి టిడిపి, టిజేఎస్ వంటి పార్టీలు రాష్ట్రం నుంచి అదృశ్యమైపోయినా ఆశ్చర్యం లేదు. 

ఇక్కడ కాంగ్రెస్‌, తెరాసల గురించి కొంత చెప్పుకోవలసి ఉంది. 

తెరాసలో సిఎం కేసీఆర్‌ తనంతట తానుగా తప్పుకొంటే తప్ప ఆ పదవిని పార్టీలో మరెవరూ ఆశించలేరు. అదే... కాంగ్రెస్ పార్టీలో అయితే కనీసం డజనుమంది ముఖ్యమంత్రి అభ్యర్ధులున్నారు. కనుక జైపాల్ రెడ్డి వాదిస్తున్నట్లు ఒకవేళ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీయే గెలిచినా ముందుగా ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్ష పదవులకు కీచులాటలు మొదలవుతాయి. ఆ తరువాత మంత్రి పదవుల కోసం కీచులాటలు ఉండనే ఉంటాయి.

ఈ రెండు అగ్నిపరీక్షలు పూర్తయ్యేసరికి పార్టీలో అసంతృప్తి సెగలు మొదలవుతాయి. అవి తమ కుర్చీలకు ఎసరు తేకుండా కాపాడుకొనేందుకు తిప్పలు పడుతూనే, ఇచ్చిన హామీలన్నిటినీ అమలుచేయడం, చేయలేకపోతే ఒకపక్క టిజేఎస్ మరోపక్క తెరాస నుంచి మద్దెలమోత భరించక తప్పదు. ఈ సమస్యలన్నిటినీ భరిస్తూనే తెరాస కంటే సమర్ధమైన పాలన అందించడం ముఖ్యమంత్రి సీట్లో ఎవరు కూర్చోన్నా కత్తిమీద సాముగానే మారుతుంది. 

కనుక ఎన్నికల తరువాత కేసీఆర్‌, తెరాస పరిస్థితి ఏమిటని కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నించే బదులు, ముందు తమ పరిస్థితి ఏమిటని జైపాల్ రెడ్డి వంటి కాంగ్రెస్‌ నేతలు ఆలోచిస్తే మంచిదేమో?


Related Post