కేటిఆర్‌ సవాలును కాంగ్రెస్‌ స్వీకరించగలదా?

October 15, 2018


img

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరందుకొంది కనుక అధికార, ప్రతిపక్ష పార్టీల మద్య రోజూ సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, పరస్పర విమర్శలు సర్వసాధారణమైపోయాయి. 

మంత్రి కేటిఆర్‌ కాంగ్రెస్ పార్టీకి సరికొత్త సవాలు విసిరారు. “ఈ ఎన్నికలలో తప్పకుండా గెలవగలమని పగటికలలు కంటున్న కాంగ్రెస్ నేతలు, ఈ ఎన్నికలను తమ పార్టీ విశ్వసనీయతకు రిఫరెండంగా ప్రకటించగలరా?” అని సవాలు విసిరారు. కాంగ్రెస్ పార్టీ అంత ధైర్యం చేయలేకపోయినా ఈ ఎన్నికలను తమ నాలుగున్నరేళ్ళ పాలనకు రిఫరెండంగానే భావిస్తున్నామని కేటిఆర్‌ అన్నారు. “మా ప్రభుత్వ పనితీరు, మేము చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు సంతృప్తిగా ఉన్నారనే భావిస్తున్నాము. కనుక ఈ ఎన్నికలలో ప్రజలు మళ్ళీ మా పార్టీకే ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించడం ఖాయం,” అని అన్నారు. 

మంత్రి కేటిఆర్‌ సవాలును కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తుందని భావించలేము. ఎందుకంటే, అది ఈసారి ఎన్నికలలో తన విశ్వసనీయత కంటే సిఎం కేసీఆర్‌ నిరంకుశవైఖరి పట్ల, ముఖ్యంగా కొంతమంది తెరాస ఎమ్మెల్యేల పనితీరు పట్ల ప్రజలలో నెలకొన్న వ్యతిరేకతను నమ్ముకొని బరిలో దిగుతోందని చెప్పవచ్చు. ఆ ప్రయత్నంలో తెరాస వ్యతిరేక ఓట్లు చీలిపోకూడదనే ఉద్దేశ్యంతోనే ప్రజాకూటమి ఏర్పాటుచేసుకొంటోంది. ఒకవేళ తెరాస పట్ల ప్రజలలో ఆమాత్రం వ్యతిరేకత కూడా లేకపోయుంటే కాంగ్రెస్ నేతలలో నేడు ఇంత ధైర్యం, నమ్మకం, ఆత్మవిశ్వాసం కనబడి ఉండేవే కావు. 

అయితే సిఎం కేసీఆర్‌ నియంతృత్వ, అప్రజాస్వామిక వైఖరితో వ్యవహరిస్తున్నప్పటికీ దాని వలన సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు కనుక వారు ఆయన చేస్తున్న రాష్ట్రాభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాలనే పరిగణనలోకి తీసుకొని ఓట్లు వేయవచ్చు. ఇక కొంతమంది తెరాస ఎమ్మెల్యేల పనితీరు పట్ల ప్రజలలో అసంతృప్తి నెలకొని ఉందనే సంగతి సిఎం కేసీఆర్‌ కు తెలియదనుకోలేము. అందుకే ఈసారి ఎన్నికలలో తమ అభ్యర్ధులను బట్టి కాక సిఎం కేసీఆర్‌ పేరుమీదనే తెరాస ప్రజలను ఓట్లు కోరుతుండటం గమనించవచ్చు. కనుక ఈ ఎన్నికలు ఖచ్చితంగా సిఎం కేసీఆర్‌ పాలనకు రిఫరెండంగానే భావించవచ్చు. ఒకవేళ కేసీఆర్‌ చెప్పినట్లుగా ఈ ఎన్నికలలో తెరాస 110 స్థానాలు గెలుచుకోగలిగితే ఆయన పాలనకు నూటికి 110 మార్కులు పడినట్లే భావించవచ్చు. అదే సమయంలో తెరాస నేతలు కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడంలేదని కూడా స్పష్టం అవుతుంది.

కాంగ్రెస్‌, కేసీఆర్‌లలో ప్రజలు ఎవరిని నమ్ముతున్నారనే విషయం   డిసెంబర్ 11న ఫలితాలు వెలువడినప్పుడు తేలుతుంది. కనుక అంతవరకు ఇరుపక్షాల వాదనలు వింటూ పార్టీలను బేరీజు వేసుకోవలసిందే.


Related Post