ప్రజాకూటమిలో కొత్త ట్విస్ట్

October 15, 2018


img

ప్రజాకూటమిగా పేరు మార్చుకొన్న మహాకూటమిలో ఆదివారం ఊహించని పరిణామాలు జరిగాయి. కూటమిలో సీట్ల సర్దుబాట్లపై ప్రతిష్టంభన ఏర్పడటంతో కాంగ్రెస్‌ కోర్ కమిటీ సభ్యులు నిన్న హోటల్  గోల్కొండలో సమావేశమయ్యి సుదీర్గంగా చర్చించారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, పార్టీ సీనియర్‌ నేతలు జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, మధుయాష్కీ గౌడ్, రేవంత్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్, చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సలీం అహ్మద్, శ్రీనివాస కృష్ణన్‌లు పాల్గొన్నారు. వారు కొన్ని కీలకనిర్ణయాలు తీసుకొన్నారు. 

1. ప్రజాకూటమిలో సీట్ల సర్దుబాట్ల గురించి మిత్రపక్షాలతో చర్చించి ఒప్పించేందుకు సీనియర్ నేత కె జానరెడ్డి అధ్యక్షతన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్‌, సీనియర్‌ నేత జి.చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వినయ్‌కుమార్‌లతో సభ్యులుగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దసరా పండుగలోగానే ఈ వ్యవహారాలన్నీ చక్కబెట్టి దసరా రోజున ప్రజాకూటమి అభ్యర్ధులను ప్రకటించాలని కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

2. టిజేఎస్ ఎన్నికల గుర్తు కోసం ఎన్నికల కమీషన్ వద్దకు వెళ్ళినట్లయితే ఊహించని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కనుక తెలంగాణ జనసమితి తరపున పోటీ చేయబోయే అభ్యర్ధులు అందరూ కాంగ్రెస్‌ బీ-ఫారమ్స్ పై పోటీ చేస్తే బాగుంటుందనే ప్రతిపాదన చేశారు. దీనికి టిజేఎస్ ఒప్పుకొంటే 8-10 సీట్లు ఇవ్వాలని నిర్ణయించింది. టిడిపికి-10-12 సీట్లు, సీపీఐకి-2 సీట్లు కేటాయించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది.

3. కూటమి కనీస ఉమ్మడి ప్రణాళిక కమిటీకి చైర్మన్‌గా కోదండరాంను నియమించాలనిప్రొఫెసర్ కోదండరామ్ కాంగ్రెస్‌ నిర్ణయించింది. ప్రజాకూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనకు డెప్యూటీ సిఎం హోదాను కల్పించాలని నిర్ణయించింది.

4. ప్రొఫెసర్ కోదండరామ్ ఎన్నికలలో పోటీ చేయకుండా ఎన్నికల ప్రచారానికే పరిమితం కావాలని, తద్వారా ప్రజాకూటమి విజయావకాశాలు మరింత పెరుగుతాయని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది.    

కాంగ్రెస్‌ కోర్ కమిటీ సమావేశం ముగిసిన వెంటనే జానారెడ్డి తదితరులు టిజేఎస్ నేతలు దిలీప్‌ కుమార్, రచనా రెడ్డిలతో భేటీ అయ్యి తమ పార్టీ నిర్ణయాలను, ప్రతిపాదనలను వారి ముందుంచారు. వారు తమ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ తో చర్చించుకొని తమ నిర్ణయం తెలుపుతామని చెప్పారు. 

ఒకవేళ కాంగ్రెస్‌ బి-ఫారంలపై తెలంగాణ జనసమితి అభ్యర్ధులు పోటీ చేయడానికి అంగీకరించినట్లయితే, గెలిచిన తరువాత వారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలుగానే గుర్తింపు పొందుతారు కనుక అప్పుడు వారిపై టిజేఎస్ కు ఎటువంటి నియంత్రణ, సంబందాలు ఉండకపోవచ్చు. కనుక ఈ ప్రతిపాదనకు ప్రొఫెసర్ కోదండరామ్ అంగీకరించకపోవచ్చు. ఒకవేళ అంగీకరిస్తే భవిష్యత్తులో టిజేఎస్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి కూడా ఆయన అంగీకరించినట్లే భావించవచ్చు. 


Related Post