కాంగ్రెస్‌-టిడిపిలలో ఏది దేనిపై ఆధారపడున్నాయి?

October 13, 2018


img

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఒంటరిగా తెరాసను ఎదుర్కొనే ధైర్యం లేకనే ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు సహాయం తీసుకొంటోందని తెరాస ఎంపీ కవిత ఆరోపించారు. బాబు సహాయసహకారాలు లేకపోయినట్లయితే కాంగ్రెస్ పార్టీ సీట్లు గెలుచుకొనే పరిస్థితిలో లేదని ఆమె ఎద్దేవా చేశారు. 

అయితే ఫిరాయింపుల కారణంగా బలహీనపడినందున టిడిపి ఈ ఎన్నికలలో గౌరవప్రదమైన స్థానాలు గెలుచుకొని తన ఉనికిని కాపాడుకోవాలనే ఆలోచనతోనే బద్ధ శత్రువైన కాంగ్రెస్ పార్టీతో జత కట్టేందుకు సిద్దపడిందని చెప్పవచ్చు. అయితే ఈ నిర్ణయం తీసుకొన్నది మాత్రం ఏపీ సిఎం చంద్రబాబు నాయుడేనని వేరే చెప్పనవసరం లేదు. కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారం చేస్తున్నప్పుడే ఆయన రాహుల్ గాంధీకి షేక్ హ్యాండ్ ఇచ్చి దీనికి నాంది పలికారు. టిటిడిపి నేతలు అది పట్టుకొని అల్లుకుపోతున్నారని చెప్పవచ్చు. టిడిపి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్‌రెడ్డి తూర్పు-పడమర వంటి ఈ రెండుపార్టీలను కలపడానికి తనవంతు కృషి చేయడం సహజమే. 

ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, గత నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో అనేకానేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి మంచి ప్రజాధారణ పొందిన తెరాసను, గొప్ప రాజకీయ వ్యూహనిపుణుడైన సిఎం కేసీఆర్‌ను ఎదుర్కోవాలంటే టిడిపి, టిజేఎస్, సిపిఐలతో పొత్తులు అవసరమని భావిస్తునందునే టిడిపితో పొత్తులకు సిద్దపడిందని చెప్పవచ్చు. కనుక రెండు పార్టీలు తమ తమ రాజకీయ అవసరాల కోసమే చేతులు కలిపాయని భావించవచ్చు. రాష్ట్రంలో టిడిపి పరిస్థితి బలహీనంగా ఉంది కనుక అది కాంగ్రెస్ నావలో ఎక్కి ఒడ్డుకు చేరుకోవాలనుకోవడం ఆశ్చర్యం కాదు.   

ఒకవేళ ప్రజాకూటమి వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నట్లయితే తెరాస ఆరోపణలు నిజమని దృవీకరించినట్లవుతుంది. దాని వలన ప్రజాకూటమి తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది  కనుక ఆయన దానికి దూరంగా ఉండేందుకే మొగ్గు చూపవచ్చు. టిడిపి అధినేతగా అవసరమైతే తెరాసను ఏవిదంగా ఎదుర్కోవాలో టిటిడిపి నేతలకు చంద్రబాబు మార్గదర్శనం చేయవచ్చు.


Related Post