గులాబీకారులో కలకలం

October 13, 2018


img

మంత్రి కడియం శ్రీహరి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నియోజకవర్గ సమన్వయ కమిటీల సమావేశంలో పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఈసారి ఎన్నికలలో తెరాస ఘనవిజయం సాధించడం ఖాయం. తెరాసను ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ మహా కూటమిగా ఏర్పడినా బాహుబలి వంటి కేసీఆర్‌ను ఓడించడం వాటివల్ల కాదు. కనుక తెరాసలో అందరూ అభిప్రాయభేదాలు పక్కనపెట్టి కలిసికట్టుగా పనిచేసి ప్రతీ తెరాస అభ్యర్ధిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి,” అని అన్నారు. 

ఈ సమావేశంలో పాల్గొన్న తెరాస అసమ్మతి నేత తక్కెళ్లపల్లి రవీందర్‌రావు కడియం శ్రీహరి చెప్పినదంతా విన్న తరువాత, మహబూబాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శంకర్‌నాయక్‌ గెలుపు కోసం తాను అన్నివిధాలా సహాయసహకారాలు అందిస్తానని, కానీ పార్టీ నాకు టికెట్ కేటాయించినా, కేటాయించకపోయినా పాలకుర్తి నుంచి పోటీ చేయడం తధ్యమని తేల్చి చెప్పడం విశేషం. పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావుకు టికెట్ ఖరారయింది. ఈ సమావేశానికి కొందరు తెరాస అసమ్మతినేతలు, వారి అనుచరులు హాజరుకాకపోవడం గమనిస్తే తెరాసలో ఇంకా అసమ్మతి సెగలు రగులుతూనే ఉన్నాయని స్పష్టం అవుతోంది. 

మొదటి జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 103 మందికి టికెట్లు ఖరారు చేసిన సిఎం కేసీఆర్‌, పార్టీలో సీనియర్ నేతలైన కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డి వంటివారికి టికెట్లు ఖరారు చేయకపోవడం ఆశ్చర్యకరమే. గతంలో స్టేషన్ ఘన్‌పూర్‌ కు ప్రాతినిధ్యం వహించిన కడియం శ్రీహరి, ఇప్పుడు ఇష్టం ఉన్నాలేకపోయినా అక్కడి నుంచి పోటీ చేస్తున్న టి. రాజయ్యకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయవలసివస్తోంది. 

ఇంకా ఇటీవల తెరాసలో చేరిన దానం నాగేందర్, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి వంటివారికి టికెట్లు కేటాయిస్తారో లేదో? కేటాయిస్తే తెరాస నేతలకు ఆగ్రహం కలుగుతుంది. కేటాయించకపోతే వారికి ఆగ్రహం కలుగుతుంది. తక్కెళ్లపల్లి రవీందర్‌రావు వంటి మరికొందరు నేతలు అసమ్మతిరాగాలు నేటికీ వినిపిస్తూనే ఉన్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తెరాస నేత గండ్ర సత్యనారాయణ రావు పార్టీపై తిరుగబాటు చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. సిఎం కేసీఆర్‌ తనకు టికెట్ ఇస్తానని చెప్పి మోసం చేశారని కనుక జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గం నుంచి తెరాస అభ్యర్ధిగా పోటీ చేస్తున్న స్పీకర్ మధుసూధనాచారిని ఓడించి ప్రతీకారం తీర్చుకొంటానని శపధం చేశారు. 

తెరాస రెండవ జాబితా ప్రకటించిన తరువాత మరికొంత మంది వారితో కలిసి అసమ్మతి రాగాలు కోరస్ పాడవచ్చు. నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగిసేవరకు అంటే నవంబర్ 12 వరకు తెరాసతో సహా అన్ని పార్టీలలో ఈ అసమ్మతి స్వరాలు వినిపిస్తూనే ఉంటాయి.


Related Post