తెరాస ఉచ్చులో కోదండరామ్?

October 13, 2018


img

తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ తెరాస అమలుచేసిన ఎన్నికల వ్యూహంలో చిక్కుకొన్నారా? అంటే అవుననే అనిపిస్తోంది. మొదట 119 స్థానాలకు పోటీ చేస్తామని ప్రగల్భాలు పలికిన ఆయన ఇప్పుడు కేవలం 3 సీట్ల కోసం కాంగ్రెస్‌ పార్టీ చుట్టూ తిరుగుతున్నారని తెరాస నేతలు పదేపదే ఎద్దేవా చేశారు. తెరాస నేతల అవహేళన ఆయన ఆహాన్ని దెబ్బతీసి ఉండవచ్చు. దాంతో ఆయన 20 సీట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

మహా కూటమిలో టిడిపి, సిపిఐ పార్టీలు సీట్ల విషయంలో  పట్టువిడుపులు ప్రదర్శించి సర్దుకుపోవడానికి సిద్దపడుతున్నాయి. టిడిపికి-12, టిజేఎస్-6, సిపిఐ-3 స్థానాలు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సంసిద్దత వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రొఫెసర్ కోదండరామ్ మాత్రం పట్టువిడవకపోవడంతో సీట్ల సర్దుబాట్ల చర్చలలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఒకవేళ సీట్ల సర్దుబాట్లు కాకపోతే ఆయన మహాకూటమి నుంచి బయటకు వెళ్ళిపోయేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. అందుకే ఆయన 48 గంటల డెడ్ లైన్ విధించారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీనికంతటికి కారణం తెరాస అమలుచేసిన వ్యూహమేనని అర్ధమవుతోంది. 

ప్రొఫెసర్ కోదండరామ్ ఆశించినన్ని స్థానాలు లభించే అవకాశం లేదు కనుక మహాకూటమి నుంచి టిజేఎస్ తప్పుకొంటే ఆదిలోనే దానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. తెలంగాణ జనసమితికి బలమైన అభ్యర్ధులు లేరు కనుక దానికి ఎన్ని సీట్లు కేటాయిస్తే అవన్నీ తెరాసకు అప్పజెప్పినట్లే అవుతుందని మిత్రపక్షాలు వాదన. ఇదే విషయం మిగిలిన పార్టీలు ఆయనకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 

ఒకవేళ ప్రొఫెసర్ కోదండరామ్ వారి మాటలను మన్నించి మహా కూటమిలో కాంగ్రెస్ ఇచ్చే 6 సీట్లతో సర్దుకుపోతే తెరాస నేతల అవహేళనను భరించక తప్పదు. కాదని మహాకూటమి నుంచి బయటకు వెళితే ఆయనే దాని ఓట్లు చీల్చడం ఖాయం. కనుక ఏవిదంగా చూసినా ఈ సీట్ల సర్దుబాట్లు ప్రొఫెసర్ కోదండరామ్ కు, మహా కూటమికి కూడా అగ్నిపరీక్షేనని చెప్పవచ్చు. తెరాస విసిరిన ఈ ఉచ్చులో నుంచి ఆయన, మహా కూటమి ఏవిదంగా బయటపడతాయో చూడాలి.


Related Post