సీనియర్ కాంగ్రెస్ నేత భార్య బిజెపిలోకి జంప్!

October 11, 2018


img

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఇవాళ్ళ పెద్ద షాక్ తగిలింది. పార్టీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహ భార్య పద్మినీ రెడ్డి ఇవాళ్ళ బిజెపిలో చేరిపోయారు. ఆమె రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో బిజెపిలో చేరారు. ఒకపక్క భర్త కాంగ్రెస్ పార్టీలో కీలక పదవిలో ఉంటే ఆమె బిజెపిలో చేరడంతో కాంగ్రెస్ పార్టీలో కలకలం మొదలైంది. ఆమె తన భర్తకు ముందుగా తెలియజేయకుండా బిజెపిలో చేరి ఉంటారనుకోలేము. కానీ ఆ విషయం ఆయన పార్టీకి తెలియజేయకపోవడం చేత ఇప్పుడు పార్టీలో అందరూ ఆయనను అనుమానంగా చూసే పరిస్థితి ఏర్పడింది. ఆయన కూడా బిజెపిలో చేరేందుకు సిద్దపడే ముందుగా భార్యను పంపించారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సందర్భంగా బిజెపి అధికార ప్రతినిధి మురళీధర్ రావు మాట్లాడుతూ మున్ముందు ఇంకా అనేకమంది ముఖ్యనేతలు తమ పార్టీలో చేరబోతున్నారని చెప్పారు. అంటే త్వరలో దామోదర రాజనర్సింహ కూడా బిజెపిలో చేరబోతున్నారని సంకేతం ఇస్తున్నారా? అనే సందేహం కలుగుతోంది.    

పద్మినీ రెడ్డి పరిపూర్ణానంద స్వామి భక్తురాలు. స్వామీజీ ఇటీవల డిల్లీ వెళ్ళి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ తరువాతే పద్మినీ రెడ్డి బిజెపిలో చేరడంతో స్వామీజీ సలహా మేరకే ఆమె బిజెపిలో చేరి ఉండవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే తాను మోడీ సుపరిపాలన చూసి ఆకర్షితులై బిజెపిలో చేరానని పడికట్టు పదాలు వల్లించారు. తన భార్య బిజెపిలో చేరడంపై దామోదర రాజనర్సింహ ఏమి చెపుతారో చూడాలి. 


Related Post