కొడుకు త్యాగమూర్తి..మరి తల్లి?

October 10, 2018


img

తెలంగాణ ఉద్యమాలను తన బలిదానంతో ఉదృతరూపం కల్పించిన వ్యక్తి శ్రీకాంతాచారి. తెలంగాణ సాధన కోసం తన ప్రాణాలనే తృణప్రాయంగా తలిచి బలిదానం చేసుకొన్న అమరవీరుడు ఆయన. కానీ అంత గొప్ప త్యాగం చేసిన ఆ అమరవీరుడికి జన్మనిచ్చిన తల్లి శంకరమ్మ మాత్రం చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొన్నట్లుగా, కొడుకు త్యాగానికి వెలకట్టి రాజకీయంగా ఎదగాలని ప్రయత్నిస్తుండటం విస్మయం కలిగిస్తుంది. ఆమె కొడుకు తెలంగాణ కోసం బలిదానం చేసుకొన్నాడు కనుక ఆమెను తప్పకుండా గౌరవించాల్సిందే. అందుకే ఆమెకు గత ఎన్నికలలోనే పిలిచి టికెట్ ఇచ్చారు కేసీఆర్‌. అయితే ఆమె ఓడిపోయారు అది వేరే సంగతి. అప్పటి నుంచి ఆమె పూర్తిస్థాయి రాజకీయ నేతగా మారారు. అదీ తప్పు కాదు కానీ ఆమె తన స్వశక్తితో ఎదిగితే అందరూ హర్షించేవారు కానీ ఎదగలేకపోయారు. తెరాస టికెట్ తన హక్కు అన్నట్లు భావిస్తూ దాని కోసం గట్టి ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. 

మొదట తనకు హుజూర్ నగర్ నుంచి టికెట్ కేటాయించాలని డిమాండ్ చేసిన ఆమె,  అక్కడ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బరిలో దిగే అవకాశం ఉండటంతో తనకు సూర్యాపేట నుంచి పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అదీ తప్పు కాదు. కానీ తనకు టికెట్ ఇవ్వకపోతే మంత్రి జగదీష్ రెడ్డి ఇంటి ముందే కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకొంటానని బెదిరించడమే తప్పు. తన చావుకు ఆయనే కారణమవుతాడని ఆమె చెప్పడం ఇంకా తప్పు. 

టికెట్ కోసం పార్టీలో చాలా మంది పోటీ పడుతుంటారు. టికెట్ రానివారందరూ  శంకరమ్మలాగా ఆత్మహత్యలు చేసుకోవడం లేదు కదా? ఒకవేళ ఆమెకు తెరాస ఏకారణం చేతైన టికెట్ ఇవ్వలేకపోతే స్వతంత్రంగా పోటీ చేయవచ్చు లేదా వేరే పార్టీలో చేరి పోటీ చేయవచ్చు కానీ ఈవిదంగా బెదిరింపులకు పాల్పడటం చూసి ఆమె కుమారుడి ఆత్మ క్షోభిస్తుందని చెప్పక తప్పదు. కొడుకు తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానం చేసుకొంటే తల్లి తెరాస టికెట్ కోసం ఆత్మహత్య చేసుకొంటానని బెదిరిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకవేళ నిజంగా ఆత్మహత్య చేసుకొంటే తన గురించి జనం ఏమనుకొంటారు? అని ఒకసారి ఆలోచిస్తే ఇటువంటి మాటలు మాట్లాడరు. 


Related Post