తెరాస మరో రెండు నెలలు ఇదే పాట పాడుతుందా?

October 10, 2018


img

శాసనసభ రద్దు చేసిన తరువాత నుంచి తెరాస నేతలు కాంగ్రెస్-టిడిపిల అపవిత్రపొత్తులు, మహాకూటమి వెనుక చంద్రబాబు నాయుడు పాత్రను ఎత్తి చూపుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. తెరాసకు గట్టి సవాలు విసుర్తున్న మహా కూటమిని కట్టడి చేయడానికి సిఎం కేసీఆర్‌ కనిపెట్టిన ఈ వ్యూహం అందరినీ బాగానే ఆకట్టుకొంటోంది. సిఎం కెసిఆర్ చాలా తీవ్ర పదజాలంతో చంద్రబాబు నాయుడును, కాంగ్రెస్ నేతలను విమర్శించారు. ఆలోచింపజేస్తోంది కూడా. ఇది ఎన్నికల వేడిని పెంచి కొనసాగించేందుకు ఉపయోగపడుతోంది. కానీ తెరాస నేతలు రోజూ పాడిందే పాట అన్నట్లు పదేపదే చేస్తున్న ఆ విమర్శలపై ప్రజలు కూడా ఆసక్తి కోల్పోతున్నారు. 

తెరాసకు సవాలు విసురుతున్న మహాకూటమిని రాజకీయంగా ఎదుర్కోవలసిందే కానీ ముందస్తు ఎన్నికల అసలు ఉద్దేశ్యం మరిచిపోయి మహాకూటమిని విమర్శిస్తూ కాలక్షేపం చేయడం సరైన నిర్ణయమేనా? అని తెరాస నేతలు ఆలోచించవలసి ఉంది. 

సార్వత్రిక ఎన్నికలలో అయితే జాతీయ అంశాలపైనే ఎక్కువగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. దాని వలన అయితే కాంగ్రెస్ లేదా బిజెపిలు లబ్ధి పొందుతాయి. కనుక ముందస్తు ఎన్నికలకు వెళ్ళినట్లయితే, గత నాలుగన్నరేళ్ళలో తెరాస హయాంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ పధకాలను ఎన్నికలలో ప్రధాన అజెండాగా చేసి వాటి గురించి ప్రజలకు చెప్పుకొని ఓట్లు పొందవచ్చునని కేసీఆర్‌ ఆలోచన కావచ్చు. కానీ గత నెలరోజులుగా ఆ అజెండాను పక్కన పెట్టి, తెరాస నేతలందరూ కాంగ్రెస్-టిడిపిల అపవిత్రపొత్తులపై విమర్శలు, చంద్రబాబు నాయుడును తిట్టడంతోనే కాలక్షేపం చేస్తున్నారు. 

తెలంగాణలో జరిగిన అభివృద్ధి గురించి, ఇక ముందు చేయబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి వినాలని ఎదురు చూస్తున్న ప్రజలు ఈ తిట్లపురాణాలను వినీ వినీ విసుగెత్తిపోతున్నారని చెప్పక తప్పదు. కనుక ఇకనైనా ప్రజలు ఏమి వినాలనుకొంటున్నారో అదే వినిపిస్తే తెరాసకు చాలా మేలు కలుగవచ్చు. లేకుంటే ప్రతిపక్షాలను ఎన్ని తిట్లు టిడితే మళ్ళీ అంతకు రెట్టింపు తిట్లు భరించడానికి సిద్దపడాలి. Related Post