అమిత్ షా తేల్చి చెప్పేశారు

October 10, 2018


img

రాష్ట్రంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించినప్పుడే రాష్ట్ర బిజెపి నేతలు దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. కనుక దానికి కేంద్రం అంగీకరించబోదని స్పష్టం అయ్యింది. ఆ సంగతి సిఎం కెసిఆర్ కు తెలియదనుకోలేము. కానీ ఆయన శాసనసభలో దాని కోసం ఒక తీర్మానం ఆమోదించి డిల్లీకి పంపించి చేతులు  దులుపుకొన్న సంగతి అందరికీ తెలిసిందే. 

ఈరోజు కరీంనగర్ బహిరంగసభలో పాల్గొనడానికి హైదారాబాద్ వచ్చిన అమిత్ షా, మీడియాతో మాట్లాడుతూ, “మతప్రాతిపదికపై రిజర్వేషన్లు కల్పించడానికి మా పార్టీ వ్యతిరేకం. కనుక ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. అటువంటి ప్రయత్నాలను బిజెపి గట్టిగా అడ్డుకొంటుంది. ఎందుకంటే, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే బీసీలకు అన్యాయం జరుగుతుంది,” అని అన్నారు. 

అంటే తెరాస ప్రభుత్వం పంపిన ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం చెత్తబుట్టలో పడేసిందని చెప్పకనే చెపుతున్నారు. అయితే సిఎం కెసిఆర్ ఆ ప్రతిపాదనతో ముస్లింల ఓటర్లను ఆకట్టుకోవాలనుకొంటే, దానిని అడ్డుకొన్నామని చెప్పుకొని హిందూ ఓటర్లను ఆకట్టుకోవాలని అమిత్ షా ప్రయత్నిస్తున్నారు. కనుక ఈ ప్రతిపాధనతో ముస్లింలకు ఎటువంటి ప్రయోజనమూ కలుగకపోయినా దాని గురించి వాదోపవాదాలు చేసుకొని తెరాస, బిజెపిలకు రాజకీయలబ్ది పొందగలవని చెప్పవచ్చు. 


Related Post