టిఆర్ఎస్‌ సరికొత్త ఎన్నికల వ్యూహం

September 22, 2018


img

సాధారణంగా ఎన్నికలప్పుడు పార్టీలు వాటి నేతలు తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమేమి చేస్తామో చెపుతూ హామీలు ఇస్తుంటారు. కానీ టిఆర్ఎస్‌ ఒక సరికొత్త ట్రెండ్ పరిచయం చేస్తోందిప్పుడు. టిఆర్ఎస్‌ పార్టీ అభ్యర్ధులకే తప్పకుండా ఓట్లు వేస్తామని ప్రజల నుంచే సామూహిక వాగ్ధానాలు చేయించుకొంటోంది. గ్రామాలలో ఎన్నికల ప్రచారానికి వెలుతున్న టిఆర్ఎస్‌ నేతలు, అభ్యర్ధులు, వారి అనుచరులు స్థానిక ప్రజలను కూడగట్టి వారి చేత సామూహిక వాగ్ధానాలు చేయిస్తున్నారు. అంతేగాక వారి నుంచి ఆ మేరకు హామీ పత్రాలు కూడా తీసుకొంటున్నారు. పైగా టిఆర్ఎస్‌ అభ్యర్ధుల ప్రచారఖర్చులకు రూ.1,000 నుంచి 5,000 ప్రజల నుంచే విరాళాలు కూడా అందుకొంటున్నారు. 

అయితే తమ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల సంతృప్తి చెందిన ప్రజలే వారంతట వారే టిఆర్ఎస్‌ అభ్యర్ధులకే ఓట్లు వేస్తామని సామూహిక ప్రమాణాలు చేస్తున్నారని టిఆర్ఎస్‌ నేతలు వాదించవచ్చు. కానీ ప్రతీ గ్రామంలో ప్రజలందరూ టిఆర్ఎస్‌ సర్కారు పట్ల సంతృప్తిగా ఉన్నారా? అందరూ టిఆర్ఎస్‌కే అనుకూలంగా ఉంటారా? వేరే పార్టీలు నచ్చేవారు ఉండరా? అని ఆలోచిస్తే వాస్తవం అర్ధమవుతుంది. టిఆర్ఎస్‌ అభ్యర్ధులకే తప్పనిసరిగా ఓట్లు వేస్తామని ప్రజలు సామూహిక ప్రమాణాలు చేయడం చూస్తుంటే గ్రామ ప్రజలపై టిఆర్ఎస్‌ నేతలు ఒత్తిడి ఉందని అర్ధమవుతోంది. టిఆర్ఎస్‌ సర్కార్ అమలుచేస్తున్న రైతుబంధు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, పెన్షన్లు వంటి సంక్షేమ పధకాలు కావాలనుకొంటే అందరూ తప్పనిసరిగా టిఆర్ఎస్‌ అభ్యర్ధులకే ఓట్లు వేస్తామని ప్రమాణాలు చేయాలని టిఆర్ఎస్‌ నేతల ఒత్తిడి చేస్తుండవచ్చు. 

టిఆర్ఎస్‌ అమలుచేస్తున్న ఈ సరికొత్త ఎన్నికల వ్యూహం గురించి మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్నప్పటికీ పొత్తులు సీట్ల సర్దుబాట్ల హడావుడిలో ఉన్న ప్రతిపక్షపార్టీలు పెద్దగా పట్టించుకొన్నట్లు కనబడటం లేదు. అవి రంగంలో దిగేసరికి రాష్ట్రంలో అన్ని గ్రామాలలో ప్రజలను టిఆర్ఎస్‌ ఈపద్దతిలో తనవైపు తిప్పుకొంటే ఇక ప్రతిపక్షాలు ఆ గ్రామాలలో ఎన్నికల ప్రచారానికి వెళ్లనవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే గ్రామాలలో ప్రజలు కట్టుబాట్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు కనుక టిఆర్ఎస్‌కు మాట ఇచ్చిన తరువాత వేరే పార్టీలకు ఓట్లు వేయకపోవచ్చు. కనుక ప్రతిపక్షాలు ఇప్పటికైనా మేలుకొని ఎన్నికల ప్రచారం మొదలుపెడితే మంచిది.    



Related Post