హరీష్ రావు అలా ఎందుకు అన్నారో?

September 22, 2018


img

మంత్రి హరీష్ రావు శుక్రవారం తను దత్తత తీసుకొన్న ఇబ్రహీంపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు, స్థానిక ప్రజలు ఆయనకు గుర్రాలతో కూర్చిన రధంపై కూర్చోబెట్టి డప్పులు డోళ్ళు వాయిస్తూ, నృత్యాలు చేస్తూ మంగళహారతులిచ్చి ఘనంగా ఊరేగిస్తూ ఊర్లోకి తీసుకువెళ్లారు. పరిసర ప్రాంతాల గ్రామాలవారు కూడా తరలివచ్చి తామందరం టిఆర్ఎస్‌ అభ్యర్ధికే ఓటేస్తామని సామూహిక ప్రమాణాలు చేశారు. ఆ మేరకు లిఖితపూర్వకంగా హామీ పత్రాలు కూడా ఆయనకు అందజేశారు. అలాగే టిఆర్ఎస్‌ అభ్యర్ధి ఎన్నికల ప్రచారఖర్చుల నిమిత్తం గ్రామప్రజలు యధాశక్తిన విరాళాలు అందజేశారు.  

వారు చూపిన ఆధారాభిమానాలతో కాస్త ఉద్వేగానికిలోనై, “నాపై మీరందరూ ఇంతగా ప్రేమానురాగాలు కురిపించడం చూస్తుంటే, ఇంత అభిమానం పొందుతున్నప్పుడే నేను రాజకీయాలలో నుంచి తప్పుకొంటే బాగుండుననిపిస్తోంది. నేను రాజకీయాలలో ఉన్నా లేకపోయినా నాపట్ల మీరు చూపుతున్న ఈ ఆదరణను ఎల్లప్పుడూ గుర్తుంచుకొని మీకు సేవ చేస్తూనే ఉంటాను. మీ సంక్షేమం కోసం పాటుపడుతూనే ఉంటాను,” అని అన్నారు. 

ఆ తరువాత హరీష్ రావు షరా మామూలుగా కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. అది వేరే సంగతి. కానీ అలనాడు కురుక్షేత్ర యుద్దం ఆరంభానికి ముందు అర్జునుడు అస్త్రసన్యాసం చేసినట్లు, ఇప్పుడు ఎన్నికల కురుక్షేత్రంలో యుద్దానికి రధంపై తరలివచ్చిన హరీష్ రావు ‘రాజకీయాల నుంచి తప్పుకొంటే బాగుండుననిపిస్తోంది’ అనడమే ఆశ్చర్యంగా ఉంది. ఆయన కేవలం భావోద్వేగంతో ఆవిధంగా అన్నారా లేక టిఆర్ఎస్‌లో ఏవైనా అంతర్గత సమస్యలు ఎదుర్కొంటున్నందున వాటిని భరించలేక ఆ మాట అన్నారో తెలియదు. కారణం ఏదైనప్పటికీ ఎన్నికల ఘట్టం కీలకదశకు చేరుకొంటున్నప్పుడు హరీష్ రావు ఈ మాట అనడం ఆశ్చర్యకరమే. 


Related Post