అంత ధైర్యం కాంగ్రెస్‌కుందా?

August 21, 2018


img

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికలలో టిఆర్ఎస్‌ను ఎదుర్కోవడమే కాక పార్టీ నిర్ణయాలను తప్పుపడుతూ పార్టీపై విమర్శలు చేస్తున్న పార్టీలో సీనియర్లను అదుపు చేయడం మరో పెద్ద సవాలుగా మారింది. కాంగ్రెస్‌ కమిటీల కూర్పును తప్పు పడుతూ నిన్న వి.హనుమంత రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన తీవ్ర విమర్శలతో టిఆర్ఎస్‌, బిజెపిల వాదనలకు బలం చేకూరుతున్నట్లుండటంతో, వారిరువురిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై చర్చించేందుకు కొత్తగా ఏర్పాటు చేయబడిన పార్టీ క్రమశిక్షణ కమిటీ సమావేశం అయ్యింది.

పార్టీ క్రమశిక్షణ అతిక్రమించినా... ఇష్టం వచ్చినట్లు మాట్లాడి పార్టీకి నష్టం కలిగించినా ఎవరినీ ఉపేక్షించబోనని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మూడు రోజుల క్రితమే అందరినీ హెచ్చరించారు. ఆ తరువాతే కాంగ్రెస్‌ కమిటీల వివరాలు ప్రకటించబడ్డాయి. అంటే వాటి పట్ల అసంతృప్తితో ఎవరూ ఎటువంటి వ్యాఖ్యలు, విమర్శలు చేసినా క్షమించబోనని రాహుల్ గాంధీ హెచ్చరించినట్లే అర్ధం అవుతోంది.

కానీ రాహుల్ గాంధీ ఆమోదముద్ర వేసిన కాంగ్రెస్‌ కమిటీలలో కెసిఆర్‌ కోవర్టులున్నారని వి.హనుమంత రావు, వాటిలో సర్పంచ్ గా కూడా గెలవలేని బ్రోకర్లు ఉన్నారని, కుంతియా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి పట్టిన శని అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కనుక వారిరువురిపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవలసి ఉంది. కానీ ఎన్నికలకు ముందు అంతా బలమైన ఇద్దరు ప్రముఖ నాయకులపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోగలదా అంటే అనుమానమే. వారిపై చర్యలు తీసుకొన్నట్లయితే వారు ఇంకా తీవ్రంగా స్పందించడం ఖాయం. దాని వలన కాంగ్రెస్ పార్టీకి ఇంకా నష్టం జరుగుతుంది. కనుక మందలింపులతో సరిపెట్టవచ్చు. 


Related Post