పొత్తులపై సర్వే! గ్రేట్!

September 21, 2018


img

కాంగ్రెస్‌, టిడిపి, సిపిఐ, టిజెఎస్ పార్టీల నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎల్ రమణ, చాడా వెంకట రెడ్డి, కోదండరాం తదితరులు ఈరోజు హైదరాబాద్‌లో సమావేశమయ్యి ఎన్నికల పొత్తుల గురించి చర్చించారు. టిడిపి, టిజెఎస్, సిపిఐ పార్టీల నేతలు తాము ఆశిస్తున్న సీట్ల జాబితాలను ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందజేశారు. పొత్తులలో భాగంగా టిడిపి, టిజెఎస్, సిపిఐ పార్టీలు కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్ధులున్న స్థానాలను కొన్నిటిని కోరుతున్నందున, పొత్తులు, సీట్లు సర్ధుబాట్లపై రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో ఒక ఫ్లాష్ సర్వే నిర్వహించి, అక్కడ పార్టీల బాలబలాలు, కాంగ్రెస్‌ అభ్యర్ధులు, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకొన్న తరువాత తుది నిర్ణయం తీసుకొందామనే ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచనకు మిగిలిన మూడు పార్టీల నేతలు సమ్మతించారు. ఏది ఏమైనపటికీ నాలుగు పార్టీలు కలిసికట్టుగా టిఆర్ఎస్‌ను ఎదుర్కొందామని అందరూ నిర్ణయించుకొన్నారు. ఒకటి రెండు రోజులలో ఫ్లాష్ సర్వే పూర్తి చేసి దాని నివేదిక ఆధారంగా మళ్ళీ నాలుగు పార్టీలు చర్చలు జరిపే అవకాశం ఉంది. 

అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారికే సీట్లు సర్ధలేక ఇబ్బందిపడుతుంటే, పొత్తుల కోసం 25-35 సీట్లు మిత్రపక్షాలకు ఏవిధంగా కేటాయించగలదు?అలాగే కాంగ్రెస్‌ నేతల మద్యే సరైన సమన్వయం, ఐక్యత లేనప్పుడు ఇక ఇతర పార్టీలతో ఏవిధంగా సమన్వయం సాధించగలరు? ఏవిధంగా కలిసికట్టుగా పనిచేయగలరు? అనే సందేహం కలుగుతుంది. ఫ్లాష్ సర్వేలో కాంగ్రెస్‌ అభ్యర్ధుల బాలబలాలు తెలుసుకోవచ్చు కానీ తప్పనిసరిగా తమకే టికెట్ కేటాయించాలని వారు పట్టుబడితే కాంగ్రెస్‌ ఏమి చేస్తుంది?కమిటీల పదవులు దక్కనందుకే ఆగ్రహం, అసంతృప్తి వెళ్లగక్కుతున్న కాంగ్రెస్‌ నేతలు, టికెట్ లభించకపోతే ఊరుకొంటారా? అదీ ఇతర పార్టీల కోసం త్యాగాలు చేయాలంటే చేస్తారా? ఈ ప్రశ్నలన్నిటికీ త్వరలోనే సమాధానాలు దొరుకుతాయి కనుక తినబోతు గారెల రుచి ఎలా ఉంది అని ఆలోచించడం అనవసరమే. 


Related Post