కుమారస్వామి ప్రభుత్వానికి ఎడ్యూరప్ప ఎసరు?

August 21, 2018


img

నాలుగు నెలల క్రితం జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో 104 సీట్లు గెలుచుకొని బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, 80 సీట్లు మాత్రమే గెలుచుకొన్న కాంగ్రెస్ పార్టీ  చురుకుగా పావులు కదిపి జెడిఎస్ కు మద్దతు ఇచ్చింది. దాంతో తంతే బూర్ల గంపలో పడినట్లు కేవలం 38 సీట్లు మాత్రమే గెలుచుకొన్న కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రి అయిపోయారు. అయితే అది మూన్నాళ్ళ ముచ్చటగానే మారే పరిస్థితి కనిపిస్తోందిప్పుడు.

ఎన్నికల తరువాత హడావుడిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టి శాసనసభలో బలనిరూపణ చేసుకోలేక 48 గంటలకే పదవిలో నుంచి దిగిపోయిన ఎడ్యూరప్ప, కుమారస్వామి కుర్చీకి ఎసరు పెట్టేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఒక్కో చేపకు గాలం వేస్తూ కూర్చోంటే ఐదేళ్ళ పుణ్యకాలం చూస్తుండగానే గడిచిపోతుందని ఎడ్యూరప్ప భావించారో ఏమో కానీ ఒకేసారి ఏకంగా 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బిజెపిలోకి ఫిరాయింపజేసేందుకు వల సిద్దం చేశారు.

తమ కాంగ్రెస్‌-జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రమేశ్ జార్కిహోళీ ఆయన సోదరుడు సతీశ్ జార్కిహోళీ నేతృత్వంలో 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బిజెపిలో ఫిరాయింపజేసేందుకు ఒక మిలటరీ విమానంలో రహస్యంగా ముంబైకు తరలించి తన ప్రభుత్వాన్ని కూలద్రోసేందుకు ఎడ్యూరప్ప కుట్ర పన్నుతున్నారని ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపించారు.

అదే కనుక జరిగితే కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడం తధ్యమే. ఎన్నికలలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బిజెపిని కాంగ్రెస్‌-జెడిఎస్ చేతులు కలిపి దెబ్బ తీస్తే, వాటిని ఎమ్మెల్యేల ఫిరాయింపు ద్వారా ఎడ్యూరప్ప దారుణంగా దెబ్బ తీయబోతున్నారన్న మాట. అయితే ఆ మూడు పార్టీలు రాజకీయ చదరంగంలో వారిని ఎన్నుకొన్న ప్రజలే ఓడిపోయారని చెప్పక తప్పదు.


Related Post