బండ్ల గణేశ్ జనసేనలో ఎందుకు చేరలేదో?

September 14, 2018


img

ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ శుక్రవారం రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన ఎప్పుడు ఏ సందర్భంలో మాట్లాడవలసి వచ్చినా మరిచిపోకుండా పవన్ కళ్యాణ్ ను పొగుడుతుంటారు. కనుక ఆయన జనసేన పార్టీలో చేరవచ్చని అందరూ భావించడం సహజం. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆశ్చర్యకరం.

కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత డిల్లీలో ఒక విలేఖరి ఇదే ప్రశ్న అడిగినప్పుడు బండ్ల గణేశ్ చాలా విచిత్రమైన సమాధానం చెప్పారు. “పవన్ కళ్యాణ్ నాకు తండ్రి వంటివారు. కానీ నాకు చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే చాలా ఇష్టం. ఏనాటికైనా ఆ పార్టీలో చేరీ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయాలనేది నా చిరకాల వాంఛ.  అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాను. అయితే నేను బేషరతుగానే కాంగ్రెస్ పార్టీలో చేరాను. కనుక పార్టీ నాకు ఏ బాధ్యత అప్పగించినా ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా చేయడానికి నేను సిద్దం,” అని చెప్పారు. 

‘కాంగ్రెస్ పార్టీ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం’ అనే ఆయన సమాధానికి తిరుగులేదు. అయితే తనకు తండ్రి, దైవంతో సమానమని చెప్పుకొనే పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరినా కూడా పోటీ చేసి గెలవవచ్చు. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయవచ్చు. కానీ జనసేనపై  నమ్మకం లేనందునే ఆయన విజయావకాశాలు కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీలో చేరి ఉండవచ్చు. 

బండ్ల గణేశ్ జూబ్లీ హిల్స్ లేదా షాద్ నగర్ నుంచి పోటీ చేయాలనుకొంటున్నట్లు సమాచారం. సాధారణంగా మంచి అంగబలం, అర్ధబలం, రాజకీయ అనుభవం ఉన్నవారికే పార్టీ టికెట్లు లభిస్తుంటాయి. కానీ అంగబలం, రాజకీయ అనుభవం బొత్తిగాలేని బండ్ల గణేశ్ ఎన్నికల గంట మ్రోగిన తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ ఆశిస్తున్నారంటే అర్ధం ఏమిటో తేలికగానే ఊహించుకోవచ్చు.


Related Post