చంద్రబాబుకు పురందేశ్వరి సూటి ప్రశ్న

September 14, 2018


img

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడానికి ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేయడం వెనుక మోడీ సర్కార్ హస్తం ఉందనే టిడిపి నేతల వాదనలపై బిజెపి నేత పురందేశ్వరి స్పందించారు. “టిడిపి నేతలకు మా ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేయడం అలవాటుగా మారిపోయింది. 2010లో మొదలైన ఈకేసు విచారణ 22సార్లు వాయిదా పడింది. ఇప్పుడు కోర్టు చంద్రబాబు నాయుడుకు నోటీస్ పంపితే అది మా తప్పా? దానితో మా పార్టీకి, కేంద్రప్రభుత్వానికి ఏమి సంబందం? ఆ నోటీసులను ప్రధాని మోడీ లేదా అమిత్ షా పంపించలేదు కదా? కావాలంటే టిడిపి నేతలు ధర్మాబాద్ వెళ్ళి ఇన్నేళ్లు ఎందుకు ఆలస్యం అయ్యింది...ఇప్పుడే ఎందుకు పంపారని వెళ్ళి ఆ మేజిస్ట్రేట్ నే అడగమనండి. 

అయినా చంద్రబాబు నాయుడుకి ఆగస్ట్ 16వ తేదీన కోర్టు నోటీసులు పంపిస్తే ఇన్ని రోజులు దాని గురించి టిడిపి నేతలు ఎవరూ ఎందుకు మాట్లాడలేదు? ఇన్ని రోజులు దానిని ఎందుకు దాచిపెట్టారు? అంటే వాళ్ళు దీనిని ఒక రాజకీయ అవకాశంగా ఉపయోగించుకోవాలనుకొన్నారా? మేము కూడా ప్రజలలోకి వెళ్ళి ఈ వ్యవహారం గురించి వారికి వివరించి టిడిపి కపట నాటకాలను బయటపెడతాము,” అని పురందేశ్వరి అన్నారు. 

పురందేశ్వరి చెప్పినట్లుగా ఒకవేళ ఆగస్ట్ 16నే చంద్రబాబు నాయుడు నోటీసులు అందుకోవడం నిజమైతే, ఆమె చెప్పినట్లుగా దీనితో టిడిపి తెలంగాణాలో రాజకీయమైలేజి పొందాలనే ఉద్దేశ్యంతోనే ఇంతకాలం ఈవిషయాన్ని దాచిపెట్టినట్లు అనుమానించవలసి వస్తుంది. ఈ విషయం బయటకు పొక్కగానే తెలంగాణాలో టిడిపి నేతలు చేస్తున్న హడావుడి చూస్తుంటే ఆమె అనుమానాలు నిజమేననిపిస్తోంది. 



Related Post