మర్రి...ఉత్తమ్ ఎవరి ప్రయత్నాలు వారివే

September 13, 2018


img

ఒకపక్క టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ముందస్తు ఎన్నికలకు సన్నాహాలు చేసుకొంటుంటే, మరోపక్క కాంగ్రెస్‌ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఎన్నికలను ఆపేందుకు ప్రయత్నిస్తుండటం విశేషం. సిఎం కెసిఆర్‌ శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు సిద్దమని ప్రకటించగానే కాంగ్రెస్‌ పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలన్నీ తప్పు పట్టాయి కానీ ముందస్తు ఎన్నికలు అనివార్యమని గ్రహించి ఎన్నికల సన్నాహాలు చేసుకొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఒకపక్క ఎన్నికల సన్నాహాలు చేసుకొంటూనే మరోపక్క ఎన్నికలను అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తుండటం విశేషం. ఆ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ప్రస్తుతం ఇదేపని మీద డిల్లీలో ఉన్నారు. 

డిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కెసిఆర్‌ శాసనసభను రద్దు చేయగానే కేంద్ర ఎన్నికల కమీషన్ ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తుండటం అనుమానం కలిగిస్తోంది. మొదట జనవరిలోగా రాష్ట్రంలో ఓటర్ల జాబితాలను ఖరారు చేయాలని షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల కమీషన్, కెసిఆర్‌ శాసనసభను రద్ధు చేయగానే దానిని కుదించి అక్టోబర్ 8నాటికే ఖరారు చేయడానికి సిద్దమవుతోంది. ఆవిధంగా చేయడం వలన రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో సుమారు 30 లక్షల మంది వివరాలు నమోదులో అవకతవకలు జరిగినట్లు నా వద్ద సాక్ష్యాధారాలున్నాయి. కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఈవిషయం వివరించి గతంలో అది ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జనవరిలోగా ఓటర్ల జాబితాను ఖరారు చేయాలని ఒప్పించడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ అది అందుకు అంగీకరించకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాను,” అని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. 

అయితే మర్రి శశిధర్ రెడ్డి ప్రయత్నాలు ఫలిస్తాయా? అంటే కాదనే అనిపిస్తుంది. కానీ ఆయన చేస్తున్న ఈ ప్రయత్నాల వలన ‘ఎన్నికలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ భయపడుతోంది’ అని టిఆర్ఎస్‌ నేతలు చెప్పుకొనేందుకు అవకాశం కల్పిస్తోంది. 


Related Post