మళ్ళీ కాంగ్రెస్‌ గూటికే డిఎస్?

September 13, 2018


img

టిఆర్ఎస్‌ నుంచి తనను బహిష్కరిస్తే తప్ప పార్టీని వీడే ప్రసక్తి లేదని బింకాలు పలికిన డి.శ్రీనివాస్ మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుకొనేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ఈరోజు ఆయన టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ గూటికి చేరుకోవాలనుకొంటున్నట్లు తెలుపగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కాంగ్రెస్‌ అధిష్టానం పిలుపు అందుకొని డిల్లీ బయలుదేరుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి డిఎస్ చేరిక విషయం అధిష్టానానికి చెప్పి వారి అనుమతితో డిఎస్ను పార్టీలో చేర్చుకొనే అవకాశం ఉంది. 

నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి డిఎస్ వంటి బలమైన, అనుభవమున్న రాజకీయ నాయకుడు ఇప్పుడు చాలా అవసరమే కనుక ఆయనను పార్టీలో చేర్చుకోవడానికి సిద్దపడుతున్నాఋ. అయితే ఎమ్మెల్సీ సీటు ఇవ్వలేదనే సాకుతో కాంగ్రెస్ పార్టీతో 30 ఏళ్ళ అనుబంధాన్ని తెంచుకొని టిఆర్ఎస్‌లోకి వెళ్ళారు. టిఆర్ఎస్‌ కూడా ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చి గౌరవించింది. కానీ ఆ పార్టీకి హ్యాండిచ్చి మళ్ళీ కాంగ్రెస్‌ గూటికి చేరాలనుకొంటున్నారిప్పుడు. ఇటువంటి అవకాశవాద రాజకీయాలు చేసే డిఎస్‌ను చేర్చుకోవడం వలన కాంగ్రెస్ పార్టీకి మేలు కలుగుతుందనుకోవడం అత్యాసే అవుతుందేమో? 

ఒక్క డిఎస్ విషయంలోనే కాదు అభ్యర్ధులందరి విషయంలో వారి విశ్వసనీయతను ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవడం మంచిది. లేకుంటే 2014 ఎన్నికలలో మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యేలు తరువాత టిఆర్ఎస్‌లోకి ఫిరాయిస్తే నష్టపోయేది కాంగ్రెస్ పార్టీయే. అప్పుడు కష్టం కాంగ్రెస్ పార్టీది లాభం టిఆర్ఎస్‌ది అవుతుంది.  


Related Post