శివాజీ చెప్పిన నోటీస్ ఇదేనా?

September 13, 2018


img

నటుడు శివాజీ నాలుగు రోజుల క్రితం హడావుడిగా హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, త్వరలో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఒక రాజ్యాంగసంస్థ నుంచి నోటీసులు అందుకోబోతున్నారని ప్రకటించారు. తనకు డిల్లీలోని అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా ఈ సమాచారం అందిందని తెలిపారు. తాను ఈవిషయం ముందే ప్రకటించినందున నోటీసులు పంపడంలో నాలుగైదు రోజులు ఆలస్యం జరుగవచ్చునేమో కానీ నోటీసులు రావడం తధ్యమని చెప్పారు. కేంద్రప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు కోసమే చంద్రబాబు నాయుడుకి నోటీసులు పంపుతున్నట్లు తాను భావిస్తున్నానని దానిని తాను ఖండిస్తున్నానని చెప్పారు. 

శివాజీ చెప్పినట్లుగానే చంద్రబాబు నాయుడుకు మహారాష్ట్రలో ధర్మాబాద్ కోర్టు నుంచి నోటీసు అందబోతున్నట్లు నారా లోకేశ్ స్వయంగా చెప్పారు. ఒకవేళ నోటీస్ వస్తే చంద్రబాబు నాయుడు తప్పకుండా కోర్టుకు హాజరవుతారని చెప్పారు. 

చంద్రబాబు నాయుడు 2010లో మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పోరాడారు. ఆ ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణా రాష్ట్రం ఎడారిగా మారుతుందని కనుక దాని నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ  టిడిపి నేతలతో కలిసి ఆ ప్రాజెక్టు వద్దకు వెళ్ళేందుకు ప్రయత్నించారు. అప్పుడు పోలీసులు చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి జైల్లో ఉంచినప్పుడు ఆయన బెయిల్ తీసుకోవడానికి కూడా నిరాకరించారు. ఆ తరువాత విడుదలయ్యారు. అది వేరేసంగతి. ఆ కేసులోనే ఒక వ్యక్తి వేసిన పిటిషన్ పై స్పందించిన ధర్మాబాద్ కోర్టు త్వరలో చంద్రబాబు నాయుడుకు నోటీసులు పంపించబోతున్నట్లు తాజా సమాచారం.

అయితే 8 ఏళ్ళ తరువాత ఈకేసులో చంద్రబాబు నాయుడుకి నోటీసులు పంపించడం చాలా సందేహాలకు తావిస్తోంది. నటుడు శివాజీ దీనిని బాబుపై కేంద్రం కక్ష సాధింపు చర్యగా అభివర్ణించినప్పటికీ, తెలంగాణాలో ఎన్నికలు జరుగబోతున్న ఈ సమయంలో బాబుకు నోటీసులు వస్తే అది తెలంగాణాలో టిడిపిపీకి సానుకూల అంశంగా మారుతుంది కదా?

చంద్రబాబు నాయుడు తెలంగాణా వ్యతిరేకి కనుక టిడిపిని దూరం పెట్టాలని టిఆర్ఎస్‌ వాదిస్తుండటం అందరూ చూస్తున్నారు. టిఆర్ఎస్‌ వాదన తప్పని నిరూపించేందుకు ఇది పనికి వస్తుంది కదా? తెలంగాణా రాష్ట్రం, తెలంగాణా ప్రజల కోసం చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళివచ్చారని టిడిపి నేతలు గట్టిగా ప్రచారం చేసుకొని టిఆర్ఎస్‌ వాదనను త్రిప్పికొట్టవచ్చు కదా? అయినా ఇది బాబును రాజకీయంగా దెబ్బ తీయడానికా లేక తెలంగాణా టిడిపికి ఉపయోగపడటానికా అనే సంగతి మున్ముందు తెలుస్తుంది.


Related Post