తెలంగాణ రైతాంగ పోరాటానికి 70 ఏళ్లు

July 04, 2016


img

భూమికోసం, భుక్తి కోసం, బానిసత్వం నుండి విముక్తి కోసం ఆనాడు తెలంగాణా ప్రజలు జరిపిన సాయుధ పోరు ప్రపంచ చరిత్రలో శిలాక్షరాలతో లిఖించదగ్గది. తదనంతరం జరిగిన అనేకానేక పరిణామాల వల్ల ఆ మహనీయ పోరాటం మరుగునపడింది. బాంచన్ నీ కాల్మొక్తా అని దొరల కింద బానిసలుగా బ్రతుకుతున్న తెలంగాణా రైతుల్లో పోరాటం చేయాలనే స్పూర్తిని రగిలించింది మొదలు, ఆంధ్ర మహాసభ అయితే ఆ పోరాటాన్ని సాయుధం చేసింది భారత కమ్యూనిస్టు పార్టీ.

వరంగల్ జిల్లా పాలకుర్తి అనే గ్రామం లో చాకలి ఐలమ్మ అనే మహిళ పంటను అక్కడి దొర గూండాలు బలవంతంగా లాక్కోవాలని చూసినప్పుడు ఈ పోరాటం సాయుధ రూపం తీసుకుంది. 1946 జూన్ లో కడివెండి అనే గ్రామం లో నిజాం అధికారులు లెవీ ధాన్యం ఇళ్లమీదపడి దోచుకుంటుండగా స్థానిక సంఘం సభ్యులు తిరగబడ్డారు. ఆనాటి పోరులో దొడ్డి కొమురయ్య నేలకొరిగాడు. అదే ఈ పోరాటం లో తొలి బలిదానం. అది మొదలు 1951లో పోరాటం నిలిపివేసేంతవరకూ నాలుగు వేల పైచిలుకు తెలంగాణా ముద్దు బిడ్డలు ఈ పోరులో అమరులయ్యారు.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఒక్క తెలంగాణపైనే కాదు దేశం మొత్తంపైనా తీవ్ర ప్రభావం చూపించింది. నాటి వెట్టి చాకిరి వ్యవస్థపై, దోపిడి దౌర్జన్యాలపై జనాగ్రహం అది. చిన్న పాయగా మొదలై పెను ఉద్యమంగా మారింది. తర్వాత కాలంలో తెలంగాణలో తలెత్తిన ప్రతి పోరాటానికి, ఉద్యమానికీ సాయుధ పోరాటమే స్పూర్తినిస్తూ వచ్చింది. దక్కన్ పీఠభూమిలో పుట్టిన సాయుధ పోరాటం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం అది. దశాబ్దాల పాటు భరించిన జనం ఒక్కసారిగా బద్దలై తమకుతామే తిరగబడ్డారు. ఆ తర్వాత ప్రజా తిరుగుబాటును కమ్యూనిస్టు పార్టీ చేతుల్లోకి తీసుకుంది. తెలంగాణలో భూస్వాముల అరాచకాలు, నైజాం పాలనలో దోపిడీపై 1921 నుంచే అనేక రూపాల్లో నిరసనలు మొదలయ్యాయి. మెల్లగా మొదలైన నిరసనలు కాస్తా 1940ల నాటికి ఉద్ధృతంగా మారాయి. మొదటిసారి 1938లో వెట్టి కూలీలు భూస్వాములపై తిరుగుబాటు చేశారు. ఆపై చాలా కాలం తరువాత ప్రజల పోరాటం సాయుధ పోరాటంగా మారింది. ఇలా మారడంలో కమ్యూనిస్టు పార్టీ కీలకంగా పనిచేసింది.

సాయుధ పోరాటంలో చైతన్యం తెచ్చిన సాహిత్యం కూడా బడుగు వర్గాల నుంచే పుట్టింది. సుద్దాల హనుమంతు, బండి యాదగిరి లాంటి వారు అద్భుతమైన సాహిత్యం అందించారు. "బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి" అంటూ యాదగిరి రాసిన పాట దశాబ్దాలుగా తెలంగాణ పోరాటాలకు స్ఫూర్తినిస్తోంది. సాయుధ రైతాంగ పోరాటం తర్వాత కూడా కమ్యూనిస్టు పార్టీ పోరాటం కొనసాగింది. నిజాంకు వ్యతిరేకంగా 1947 నుంచి 1948 వరకు పార్టీ నాయత్వంలో ప్రజల పోరాటం సాగింది. నిజాం నవాబు లొంగిపోయిన తర్వాత కూడా కమ్యూనిస్టు పార్టీ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లింది. నిషేధాల మధ్య సాగిన ఈ పోరాటాన్ని 1951 అక్టోబర్ 21న విరమించింది.




Related Post