పార్టీ పెట్టను కానీ... లక్ష్మి నారాయణ

August 18, 2018


img

ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన లక్ష్మి నారాయణ, ఆ తరువాత  మహారాష్ట్రలో తన పదవికి రాజీనామా చేయడంతో ఆయన వచ్చే ఎన్నికలలోగా రాజకీయపార్టీ పెట్టడానికే తన పదవికి రాజీనామా చేశారని మీడియాలో ఊహాగానాలు వినిపించాయి. ఆయన వాటిని ఖండించలేదు. రాజకీయాలలో చేరే ఆసక్తి ఉన్నట్లే మాట్లాడారు. కానీ ఇంతవరకు ఆయన పార్టీ పెట్టలేదు. ఏ పార్టీలోను చేరలేదు. ఆయన తన పదవికి రాజీనామా చేసి ఆంద్రాకు తిరిగి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో పర్యటిస్తూ రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకొంటున్నారు. శుక్రవారం ఆయన ప్రకాశం జిల్లాలో పల్లమల్లి గ్రామంలో రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “నేను రాజకీయ పార్టీ స్థాపిస్తానని మీడియాలో వస్తున్న వార్తలలో నిజం లేదు. కానీ ఏ పార్టీ రైతుల సంక్షేమం కోసం పాటుపడుతుందో దానితో కలిసి సాగాలనుకొంటున్నాను,” అని చెప్పారు. 

అంటే ఆయన ఏదో ఒక పార్టీలో చేరడం ఖాయంగానే కనిపిస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా తాము రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని చెప్పుకొంటూనే ఉంటాయి. కనుక లక్ష్మి నారాయణ ఏపార్టీలోనైనా చేరేందుకు ‘ఆప్షన్’ ఉంచుకొన్నట్లే భావించవచ్చు. 

అయితే ఆయన సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసినప్పుడు జగన్మోహన్ రెడ్డిపై 11 ఛార్జి షీట్లు నమోదు చేసి జైలుకు కూడా పంపించారు కనుక ఆయన వై.ఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీలో చేరే అవకాశం లేదు. ఇక కాంగ్రెస్‌, టిడిపిల పాలన ఏవిధంగా ఉంటుందో ఆయన కూడా చూశారు కనుక వాటిలో చేరకపోవచ్చు. తన హిందుత్వ భావజాలానికి దగ్గరగా ఉండే బిజెపిలో కానీ లేదా పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో గానీ చేరుతారేమో?


Related Post