అజాతశత్రువుకు ఎల్లలు లేవు

August 17, 2018


img

భారతదేశ రాజకీయాలలో అజాతశత్రువుగా పేరొందిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి అంత్యక్రియలకు దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి, అన్నీ పార్టీలకు చెందిన నేతలు హాజరవుతున్నారు. అంతేకాదు... ఇరుగుపొరుగు దేశాల నేతలు కూడా హాజరవుతున్నారు. భారత్ పట్ల విద్వేషం వెళ్ళగక్కే పాకిస్థాన్ అయన మరణవార్త వినగానే సంతాపం వ్యక్తం చేసింది. పాక్ ప్రభుత్వం తరపున ఆ దేశ న్యాయ, సమాచార శాఖ మంత్రి సయ్యద్ జఫర్ అలీ వాజ్ పేయి అంత్యక్రియలకు హాజరుకానున్నారు. అలాగే భూటాన్ రాజు జిగ్మే వాంగ్చుక్ వాజ్ పేయి అంత్యక్రియలలో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకొన్నారు. శ్రీలంక, నేపాల్  దేశాల ప్రతినిధులు ఢిల్లీ చేరుకొన్నారు. సార్క్ (సౌత్ ఏషియాన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్) దేశాలు అయన మృతికి సంతాపం ప్రకటించాయి. 

ఇక దేశంలో బీజీపీ పాలిత రాష్ట్రల ముఖ్యమంత్రులు, మంత్రులు గురువారం ఉదయం నుంచే ఢిల్లీ చేరుకోసాగారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా పలువురు భాజపాయేతర ముఖ్యమంత్రులు వాజ్ పేయి అంత్యక్రియలలో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకొంటున్నారు. దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి తరలివస్తున్న వారిని చూస్తుంటే పార్టీలకు, దేశ సరిహద్దులకు అతీతంగా అందరి మనసులు గెలుచుకొన్న గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్ పేయి అని నిరూపితం అవుతోంది.


Related Post