టిఆర్ఎస్‌లో సిట్టింగులు అందరికీ టికెట్స్ లభిస్తాయా?

August 17, 2018


img

“వచ్చే ఎన్నికలలో ఇప్పుడున్న ఎమ్మెల్యేలందరికీ మళ్ళీ టికెట్స్ ఇస్తాను. ఎందుకంటే ఇంతకంటే మంచి ఎమ్మెల్యేలు కావాలంటే ఆకాశం నుంచి దిగిరావాలి. కనుక ఎమ్మెల్యేలందరూ నిశ్చింతగా మీ నియోజకవర్గాలలో అభివృద్ధి పనులు చేసుకోవచ్చు,” అని సిఎం కెసిఆర్‌ స్వయంగా టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు. ఆ తరువాత అనేక సందర్భాలలో తమ పార్టీ 100కు పైగా సీట్లు గెలుచుకొంటుందని సిఎం కెసిఆర్‌తో సహా టిఆర్ఎస్‌ మంత్రులు చెప్పుకోవడం అందరికీ తెలుసు. కనుక సిఎం కెసిఆర్‌ ఎమ్మెల్యేలకు ఇచ్చిన తన మాట నిలుపుకొంటారా?అంటే టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు ఎవరూ ఖచ్చితంగా అవునని సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ప్రజలు ప్రభుత్వం పనితీరుపట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ సుమారు 36-40 మండి ఎమ్మెల్యేల పనితీరు పట్ల అసంతృప్తితో ఉన్నారని, వారు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని సిఎం కెసిఆర్‌ హెచ్చరిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. 

కనుక సిటింగ్ ఎమ్మెల్యేలలో కొందరికి టికెట్స్ లభించకపోవచ్చు. మరికొందరిని వేరే నియోజకవర్గానికి మార్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ జాబితాలో కొందరు మంత్రులు కూడా ఉన్నట్లు సమాచారం. సెప్టెంబరు 2న హైదరాబాద్‌ అవుటర్ రింగు రోడ్డులో జరుపబోయే బహిరంగసభలోనే టిఆర్ఎస్‌ అభ్యర్ధుల తొలి జాబితా ప్రకటించే అవకాశం ఉందని సిఎం కెసిఆర్‌ స్వయంగా చెప్పారు కనుక సిటింగ్ ఎమ్మెల్యేలలో కూడా ఆందోళన మొదలైంది. ఈలోగా సిఎం కెసిఆర్‌ జిల్లాలవారీగా ఎమ్మెల్యేలు, మంత్రులతో సమావేశం అయ్యే అవకాశం ఉందనే వార్తా వారికి కాస్త ఊరటనిస్తోంది. మరి ఆ సమావేశాలు ఎప్పుడు మొదలవుతాయో...వాటిలో సిఎం కెసిఆర్‌ ఎమ్మెల్యేలకు ఏమి చెపుతారో చూడాలి.


Related Post