సిఎం కెసిఆర్‌కు జానారెడ్డి సూటిప్రశ్న

August 17, 2018


img

తెలంగాణా కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత కె జానారెడ్డి సిఎం కెసిఆర్‌కు సూటి ప్రశ్నలు సందించారు. ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రాన్ని ఐదేళ్లు పాలించాలని ప్రజలు టిఆర్ఎస్‌కు అధికారం కట్టబెట్టారు. కానీ సిఎం కెసిఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని ఎందుకు అనుకొంటున్నారు?మరో 7-8 నెలలో లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నప్పుడు, కెసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం దేనికి? రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు నిర్వహించవలసిన పరిస్థితులు లేనప్పుడు ఎన్నికలు నిర్వహించి ఖజానాపై భారం ఎందుకు వేయాలనుకొంటున్నారు?” అని ప్రశ్నించారు.

గత ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చనందున రాష్ట్ర ప్రజలు ఉద్యమిస్తారనే భయంతోనే సిఎం కెసిఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనుకొంటున్నారని జానారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు తమ పార్టీ సిద్దంగా ఉందని అన్నారు. కెసిఆర్ ప్రకటనతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది కనుక కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల పేర్లను కూడా ఖరారు చేస్తామని తెలిపారు. ఇతరపార్టీలతో పొత్తుల గురించి కాంగ్రెస్‌ అధిష్టానమే నిర్ణయం తీసుకొంటుందని జానారెడ్డి చెప్పారు.   

ముందస్తు ఎన్నికల గురించి జానారెడ్డి అడిగిన ప్రశ్న సహేతుకమైనదే. టిఆర్ఎస్‌ తన రాజకీయ ప్రయోజనం కోసం శాసనసభకు వేరేగా ఎన్నికలు నిర్వహించడం వలన ఖజానాపై చాలాభారం పడుతుంది. దేశరాజకీయాలలో గుణాత్మకమైన మార్పులు రావాల్సిన అవసరం ఉందని పదేపదే సిఎం కెసిఆర్‌ చెపుతుంటారు. ఆ మార్పు టిఆర్ఎస్‌ నుంచే మొదలైతే అందరూ హర్షిస్తారు కదా!


Related Post