ఉత్తమ్ హామీలకు రాహుల్ భరోసా లేదా?

August 15, 2018


img

మంగళవారం సాయంత్రం సరూర్ నగర్ లో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన ‘విద్యార్థి, నిరుద్యోగ గర్జన సభ’లో టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, “1200 మంది యువత బలిదానలతో తెలంగాణా రాష్ట్రం ఏర్పడింది. కానీ సిఎం కెసిఆర్‌ విద్యార్ధులను, నిరుద్యోగ యువత పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. మిషన్ భగీరథ, ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు డబ్బులిస్తారు కానీ నిరుపేద విద్యార్ధులకు ఫీజు రీ-ఇంబెర్సమెంట్ చేయడానికి నిధులు లేవంటారు. సుమారు 14 లక్షల మంది పేద విద్యార్ధులకు ఫీజు రీ-ఇంబెర్సమెంట్ లభించడం లేదు.తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే లక్ష ప్రభుత్వోద్యోగాలు వస్తాయని చెప్పారు. కానీ అధికారం చేపట్టి నాలుగేళ్ళు గడిచిపోయినా వాటిలో సగం ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. ప్రభుత్వ శాఖలలో ఖాళీలను భర్తీ చేయకపోవడం వలన ఉద్యోగాలు ఉన్నప్పటికీ రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. టిఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా అనేక విద్యాసంస్థలు మూతపడ్డాయి. మా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తాము. రాష్ట్రంలో 10 లక్షలమంది నిరుద్యోగులకు ఒక్కొక్కరికీ నెలకు రూ.3000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాము. పేద విద్యార్ధులందరికీ మళ్ళీ ఫీజు రీ-ఇంబెర్సమెంట్ చెల్లిస్తాము, అని హామీ ఇచ్చారు. 

ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇస్తున్న హామీలను కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భరోసా ఇవ్వకపోవడం వలన పార్టీలో నేతలు కూడా వాటి గురించి మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. పార్టీలోనే నేతలే ఆయన ఇస్తున్న హామీలను అనుమానిస్తున్నప్పుడు ఇక రాష్ట్ర ప్రజలు వాటిని ఎందుకు విశ్వసిస్తారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించినట్లు రాష్ట్రంలో రైతులకు ఒకేసారి రూ.2లక్షల పంటరుణాల మాఫీ, నిరుద్యోగ భృతి హామీలను అమలుచేయడం అసాధ్యమని సిఎం కెసిఆర్‌ గట్టిగా వాదిస్తున్నారు. ఒకవేళ ఆ హామీలను అమలుచేయగలిగే అవకాశమే ఉన్నట్లయితే కెసిఆరే వాటిని అమలుచేసి ప్రజలలో మరింత మంచిపేరు సంపాదించుకొనేవారు కదా?


Related Post