అయితే ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన సజీవంగా ఉన్నట్లేనా?

August 14, 2018


img

మళ్ళీ చాలా రోజుల తరువాత సిఎం కెసిఆర్‌ స్వయంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి నిన్న మాట్లాడారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆలోచన విరమించుకోలేదని దానిని తప్పకుండా ఏర్పాటుచేస్తానని కెసిఆర్ చెప్పారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చిల్లర మల్లర రాజకీయాల కోసం కాదని కెసిఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్, బిజెపిలు రెండూ 130కోట్ల మంది ప్రజల జీవితాలతో చెలగాటాలు ఆడుతున్నాయని కనుక వాటికి ప్రత్యామ్నాయంగా బలమైన ఫెడరల్‌ ఫ్రంట్‌ అవసరమన్నారు. దేశంలో విద్యా, వైద్యం, రోడ్లు, రైలు మార్గాలు తదితర విషయాలలో భారత్ చాలా వెనుకబడి ఉందని, దేశంలో గుణాత్మకమైన మార్పు తీసుకురావలసిన అవసరం ఉందని అన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు కోసం త్వరలోనే భువనేశ్వర్ వెళ్ళి ఓడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో మాట్లాడుతానని చెప్పారు. 

సిఎం కెసిఆర్‌ కనిపెట్టిన ‘గుణాత్మకమైన మార్పు’ అనే పదం చాలా వినసొంపుగానే ఉంది. కానీ కాంగ్రెస్ లేదా బిజెపిలతో అంటకాగుతూ అవకాశవాద రాజకీయాలకు అలవాటుపడిన రాజకీయ పార్టీలతో గుణాత్మకమైన మార్పు ఏవిధంగా సాధ్యం అనే సామాన్యుల ప్రశ్నకు కెసిఆరే సమాధానం చెప్పవలసి ఉంటుంది. 

ముందుగా బిజెపి, మోడీ సర్కార్ పట్ల తన వైఖరి ఏమిటో కెసిఆర్ స్పష్టం చేయవలసిన అవసరం ఉంది. కాంగ్రెస్, బిజెపిల వలన దేశం నష్టపోతోందని వాదిస్తూ, ఆ రెంటికీ ప్రత్యామ్నాయంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తానని చెపుతూనే మరోపక్క అవసరం పడినప్పుడల్లా మోడీ సర్కార్ కు అండగా నిలబడటం ద్వారా కెసిఆర్ స్వయంగా తానే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆశయానికి విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. 

అదేవిదంగా దేశంలో ప్రతిపక్ష పార్టీలు కూడా తమ రాజకీయ అవసరాలు, ప్రయోజనాల కోసం కాంగ్రెస్ లేదా బిజెపిలకు వంతపాడుతున్నాయి. ఉదాహరణకు ఇటీవల లోక్‌సభలో మోడీ సర్కార్ పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై సభలో ఓటింగ్ జరిగినప్పుడు టిఆర్ఎస్‌, శివసేన, బిజెడి దానిలో పాల్గొనకుండా పరోక్షంగా మోడీ సర్కారుకు మద్దతునిచ్చాయి. కనుక టిఆర్ఎస్‌తో సహా దేశంలో ఏ పార్టీ కూడా కాంగ్రెస్, బిజెపిలకు దూరంగా ఉండలేవని స్పష్టం అయ్యింది.

ఒకవేళ వచ్చే ఎన్నికలలో కేంద్రంలో మళ్ళీ మోడీయే అధికారంలోకి వస్తే కెసిఆర్ ఆయనతో స్నేహం కొనసాగించకుండా ఉంటారా?ఒకవేళ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు టిఆర్ఎస్‌ మద్దతు అవసరం పడితే ఇవ్వకుండా ఉంటారా? ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తారు? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కనుక కెసిఆర్ ముందుగా తన నిబద్దతను చాటుకొంటేనే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆలోచన కార్యరూపం దాల్చే అవకాశం ఉంటుంది. అయినా అవకాశవాద రాజకీయాలు చేస్తూ అధికారం కోసం ఆరాటపడే రాజకీయపార్టీలతో దేశంలో గుణాత్మకమైన మార్పు సాధ్యం అవుతుందంటే నమ్మశ్యక్యంగా లేదు.


Related Post