తీర్మానాలు సరే...కేంద్రం ఆమోదిస్తుందా?

August 14, 2018


img

సోమవారం తెలంగాణా భవన్ లో జరిగిన టిఆర్ఎస్‌ కార్యవర్గ సమావేశంలో తొమ్మిది తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. వాటిని కేంద్రానికి పంపించి అమలుచేయవలసిందిగా కోరుతామని సిఎం కెసిఆర్‌ చెప్పారు.

తీర్మానాలు చేసుకోవడం టిఆర్ఎస్‌ చేతిలో పనే కనుక ఏకగ్రీవంగా చేసేసుకొంది కానీ వాటిని కేంద్రం ఆమోదిస్తుందా? అంటే లేదనే చెప్పుకోవచ్చు. గతంలో గిరిజనులు, మైనార్టీ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే దానిని కేంద్రం పట్టించుకోలేదు. సిఎం కెసిఆర్‌ స్వయంగా ప్రధాని మోడీని కలిసి దాని గురించి అడిగినా ఆయన పట్టించుకోలేదు. మరి ఆ తీర్మానాన్నే పట్టించుకోని కేంద్రప్రభుత్వం టిఆర్ఎస్‌ చేసిన ఈ తొమ్మిది తీర్మానాలను ఆమోదిస్తుందని అనుకోగలమా? 

వాటిలో వ్యవసాయం, విద్యా, ఆరోగ్యం వంటి అంశాలలో కేంద్రం తన అధికారాలను వదులుకొని లేదా కుదించుకొని రాష్ట్రానికి అధికారాలు కట్టబెట్టాలని, లోక్‌సభలో బీసీలకు, మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని, అందుకోసం లోక్‌సభ స్థానాలు పెంచాలని, కేంద్రప్రభుత్వంలో బీసీ సంక్షేమ శాఖను ఏర్పాటు చేయాలంటూ ఈ తీర్మానాల ద్వారా కేంద్రం ఏవిధంగా నడుచుకోవాలో మార్గదర్శకాలు జారీ చేస్తే కేంద్రం పాటిస్తుందా? రాష్ట్రంలో ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్న సూచనలను, సలహాలను ప్రభుత్వం పట్టించుకోనట్లే, రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ తీర్మానాలను కేంద్రప్రభుత్వం పట్టించుకోదని ఖచ్చితంగా చెప్పవచ్చు. అదే జరుగుతుందని టిఆర్ఎస్‌కు కూడా తెలుసు.        

విభజన హామీల అమల కోసం పార్లమెంటులో గొంతు చించుకొన్నా, సిఎం కెసిఆర్‌తో సహా రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, అధికారులు డిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణాలు చేసినా నేటికీ అమలుచేయలేదు. మరి వాటికోసం తీర్మానాలు చేసి పంపడం వలన ఏమి ప్రయోజనం? అవి చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే కదా? 

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించకపోతే దాని నిర్మాణానికి రూ.20,000 కోట్లు విడుదల చేయాలని తీర్మానం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం అంతా ఉదారంగా, బారీగా నిధులు మంజూరు చేస్తుందంటే దేశంలో అన్నీ రాష్ట్రాలు కూడా ఇలాగే తీర్మానాలు చేసి కేంద్రానికి పంపిస్తాయి కదా? 

అయినా రాష్ట్రాలు తీర్మానాలు చేసి పంపిచేస్తే వాటిని కేంద్రం ఆమోదించేస్తుందనుకోవడం అవివేకమే. మరి ఈ సంగతి తెలిసి టిఆర్ఎస్‌ ఎందుకు తీర్మానాలు చేసింది అంటే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే అని చెప్పక తప్పదు. మోడీతో స్నేహం కోసం సిఎం కెసిఆర్‌ రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని కాంగ్రెస్ నేతలు పదేపదే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. విభజన హామీలను కేంద్రం అమలుచేయకపోయినా సిఎం కెసిఆర్‌, మోడీ ప్రభుత్వానికి అండగా నిలబడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణాకు అన్యాయం చేస్తున్న మోడీ ప్రభుత్వానికి సిఎం కెసిఆర్‌ ఎందుకు మద్దతు ఇస్తునారు? ఆని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా నిన్న ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల ప్రశ్నలకు జవాబుగా ఈ తీర్మానాలను కేంద్రంపైకి సంధించినట్లు చెప్పవచ్చు. 

అయితే ఈ తీర్మానాలను కేంద్రం పట్టించుకోదని సిఎం కెసిఆర్‌కు తెలుసు. టిఆర్ఎస్‌ నేతలకు తెలుసు. అయినా ఎందుకు చేశారంటే, రాబోయే ఎన్నికలలో ప్రజలు తమను తప్పు పట్టకుండా ఉండేందుకు... భాజపాను ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకేనని చెప్పవచ్చు. విభజన హామీల అమలు విషయంలో ఏపీలో తెదేపా ప్రభుత్వం ఏమి చేస్తోందో ఇప్పుడు టిఆర్ఎస్‌ ప్రభుత్వం కూడా అదే చేస్తోందని చెప్పవచ్చు. తద్వారా ఎన్నికలకు ముందు ప్రజలలో తెలంగాణా సెంటిమెంటు రగిలించి లబ్ది పొందలనే ఆలోచన కనిపిస్తోంది. 


Related Post