రాహుల్‌ జీ పాడిందే పాట ఎందుకు?

August 13, 2018


img

సోమవారం సాయంత్రం శేరిలింగంపల్లిలో జరిగిన బహిరంగసభలో పాల్గొన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాని మోడీ,సిఎం కెసిఆర్‌లను విమర్శించడం కోసమే పనిగట్టుకొని హైదరాబాద్‌ వచ్చినట్లు మాట్లాడారు. ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్‌ ఇద్దరూ మాయమాటలు చెపుతూ ప్రజలను మభ్యపెడుతున్నవారేనని విమర్శించారు. 

రాహుల్ గాంధీ సభకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చాలా చక్కటి ఏర్పాట్లు చేశారు. ఊహించిన దానికంటే బాగాఎక్కువే  జనసమీకరణ చేశారు. ఈ సభలో రాహుల్ గాంధీ ఏదో ముఖ్యమైన విషయం చెప్పబోతున్నారన్నట్లు మంచి హైప్ క్రియేట్ చేసి ప్రజల దృష్టిని ఆకర్షించగలిగారు కూడా. కానీ రాహుల్ గాంధీ పార్లమెంటులో రోజూ పాడే పాతపాటే మళ్ళీ పాడి ఇంత మంచి అవకాశాన్ని చేజార్చుకొన్నారని చెప్పక తప్పదు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఒకేసారి రూ.2లక్షలు పంటరుణాలు మాఫీ చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పదేపదే చెపుతున్నారు. కానీ రాహుల్ గాంధీ నోట ఆ ముక్క రాలేదు. అలాగే తమ పార్టీ అధికారంలోకి వస్తే టిఆర్ఎస్‌ చేయలేనివి ఏమి చేస్తుందో రాహుల్ చెప్పలేదు. వ్యవసాయం, ఉద్యోగాల కల్పన, అభివృద్ధి, సంక్షేమ పధకాల అంశాలపై తమ పార్టీ విధానాల గురించి ప్రజలకు వివరించి ఉండి ఉంటే అవి ప్రజలను ఆలోచింపజేసేవి. కానీ సామాన్య ప్రజలకు అవసరం లేని రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు కుంభకోణం గురించి మాట్లాడారు. 

రాష్ట్ర పర్యటనలకు వెళ్ళినప్పుడు ఆయా రాష్ట్రాలకు సంబందించిన విషయాలు, అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాల గురించి మాట్లాడితే ప్రజలు ఆసక్తిగా వింటారు. ఆలోచిస్తారు. కానీ అవసరం లేని విషయాల గురించి ఎంతసేపు మాట్లాడితే ఏమి ప్రయోజనం? బహుశః రేపు జరుగబోయే సభలో కూడా రాహుల్ గాంధీ మళ్ళీ ఇదే పాటపాడతారేమో?అదే చేస్తే ఆయన ఎన్నిసార్లు తెలంగాణాలో పర్యటించినా పార్టీకి ఇసుమంత ప్రయోజనం కలుగదని చెప్పక తప్పదు.


Related Post