అప్పుడు అన్నాడిఎంకె... ఇపుడు డిఎంకె!

August 13, 2018


img

కుటుంబపాలన సాగుతున్న రాజకీయ పార్టీలలో ఏదో ఒకనాడు చీలికలు తప్పవని యూపిలోని సమాజ్ వాదీ పార్టీ, తమిళనాడులో అన్నాడిఎంకె, ఇప్పుడు డిఎంకె పార్టీలు నిరూపిస్తున్నాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్, ఆయన కొడుకు అప్పటి ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఏవిధంగా కీచులాడుకొని ఎన్నికలలో ఓడిపోయారో అందరూ చూశారు. అలాగే జయలలిత చనిపోయిన తరువాత ఆ పార్టీలో శశికళ-పన్నీర్ సెల్వమ్, ఆ తరువాత పన్నీర్ సెల్వమ్-పళనిస్వామి-దినకరన్ ఏవిధంగా కీచులాడుకొని పార్టీని బజారు కీడ్చారో అందరూ చూశారు. ఇప్పుడు డిఎంకె వంతు వచ్చింది. 

ఆ పార్టీ అధినేత కరుణానిధి చనిపోగానే ఆయన కొడుకులు అళగిరి, స్టాలిన్ ఇద్దరూ పార్టీని హస్తగతం చేసుకొనేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పెద్దవాడైన అళగిరిని కరుణానిధే స్వయంగా పార్టీ నుంచి బహిష్కరించి చిన్న కొడుకు స్టాలిన్ ను తన రాజకీయ వారసుడిగా ప్రకటించారు. అతనిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించి పార్టీ పగ్గాలు అప్పగించారు. కనుక ఆయన పార్టీ నేతలను, ప్రజాప్రతినిధులను అందరినీ మంగళవారం సమావేశపరిచి, పార్టీ అధ్యక్షుడిగా పట్టాభిషేకం చేయించుకోవడానికి సిద్దం అవుతున్నారు. 

కానీ మళ్ళీ మెల్లగా తండ్రి పంచన చేరిన అళగిరి ఆయన చనిపోగానే ‘పార్టీలో కరుణానిధి తరువాత స్థానం అంటూ ఏమీ లేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అనేది ఒక ఊహాజనితమైన పదవి. పార్టీలో మెజార్టీ సభ్యులు నా నాయకత్వాన్నే కోరుకొంటున్నారు. ఎందుకంటే, పార్టీని సమర్ధంగా నడిపించగల నాయకత్వ లక్షణాలు నాకు మాత్రమే ఉన్నాయని పార్టీలో అందరూ నమ్ముతున్నారు,’ అని అన్నారు. 

తద్వారా తాను పార్టీ పగ్గాలు చేపట్టాలనుకొంటున్నట్లు అళగిరి చాలా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. కనుక అన్నదమ్ముల మద్య మళ్ళీ పార్టీపై ఆధిపత్యం కోసం గొడవలు మొదలయ్యాయి. రేపటి డిఎంకె నేతల సమావేశంలో అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించినా ఆశ్చర్యం లేదు.


Related Post