కాంగ్రెస్ నాటకం అందుకేనా?

August 10, 2018


img

నేటితో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగియనున్నాయి. కనుక నిన్న లోక్ సభలో ‘ట్రిపుల్ తలాక్’ బిల్లును ఆమోదింపజేసుకొన్న మోడీ సర్కార్, ఈరోజు రాజ్యసభలో ఆమోదింపజేసుకోవాలని ప్రయత్నిస్తోంది. అయితే ఎన్డీయే కూటమికి రాజ్యసభలో తగినంత బలం లేకపోవడంతో ఆ బిల్లును ఆమోదింపజేసుకోవడానికి కాంగ్రెస్‌ దాని మిత్రపక్షాల మద్దతు తప్పనిసరి. ఈ బిల్లుపై కేంద్రం స్పష్టమైన వైఖరితో ఉంది. ముస్లిం మహిళలను, వారి పిల్లల జీవితాలను చిద్రం చేస్తున్న ఈ ట్రిపుల్ తలాక్ విధానాన్ని రద్దు చేయాలని భావిస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీనిపై తన వైఖరి ఏమిటో స్పష్టం చేయడం లేదు. ఎందుకంటే, ఈ బిల్లుకు మద్దతు తెలిపితే ముస్లిం ప్రజలు, మత గురువుల ఆగ్రహానికి గురి కావలసివస్తుంది. వ్యతిరేకిస్తే ముస్లిం మహిళల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. అందుకే కాంగ్రెస్‌ పార్టీ             కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లు వ్యవహరిస్తోంది. బహుశః ఆ ప్రయత్నంలోనే రాఫెల్ యుద్ధవిమానాలపై సభలో చర్చ చేపట్టాలని, దీనిపై విచారణకు జాయింట్ స్టాండింగ్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు ఉభయసభలను స్తంభింపజేస్తోంది. పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద సోనియా గాంధీతో సహా కాంగ్రెస్‌ సభ్యులు ‘మోడీ అవినీతి బయటపడింది...రాఫెల్ డీల్ పై స్టాండింగ్ కమిటీ వేయాలి’ అని వ్రాసున్న ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తున్నారు. 

“ఈ బిల్లుపై మాకు స్పష్టమైన వైఖరి ఉంది’ అని చెప్పిన సోనియా గాంధీ, ఆ వైఖరి ఏమిటో రాజ్యసభలో చెప్పి ఉంటే బాగుండేది. కానీ దానిపై చర్చలో పాల్గొంటే ఏమి మాట్లాడినా పార్టీకి నష్టం కలుగుతుందనే భయంతోనే రాఫెల్ కుంభకోణంపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఉభయసభలను స్తంభింపజేసి తప్పించుకొనే ప్రయత్నం చేస్తోంది. రాజ్యసభ మళ్ళీ మధ్యాహ్నం 2.30 గంటలకు సమావేశమవుతుంది. కానీ కాంగ్రెస్ సభ్యుల తీరు చూస్తుంటే, ట్రిపుల్ తలాక్ బిల్లుపై సభలో చర్చ జరుగకుండా, జరిగినా దానిలో పాల్గొనకుండా తప్పించుకొనే ప్రయత్నాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. 


Related Post